TDP
విధాత: జగజ్జనని చిట్ ఫండ్స్ కంపెనీలో నిబంధనల ఉల్లంఘన, రికార్డ్స్ సరిగా లేకపోవడం, చిట్స్ సేకరణలో వచ్చిన డబ్బుకు, రికార్డ్స్ లో ఎంట్రీలకు సంబంధం లేకపోవడం, డబ్బును వేరే ఇతర వ్యాపారాలకు మళ్లించడం వంటి తప్పిదాలకు పాల్పడినందుకు ఆ సంస్థ యాజమాన్యం ఆదిరెడ్డి అప్పారావ్, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసారు.
ఆదిరెడ్డి అప్పారావు గతంలో టిడిపి తరపున ఎమ్మెల్సీగా పనిచేయగా ఇప్పుడు ఆయన కోడలు అంటే వాసు భార్య భవాని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టిడిపి సీనియర్ నాయకుడు దివంగత ఎర్రన్నాయుడి కుమార్తె, శ్రీకాకుళం ప్రస్తుత ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడి అక్క అయిన భవాని అరెస్ట్ వెనుక ప్రభుత్వం మరో దురాలోచన ఉందని అంటున్నారు.
ఏటా మే 27, 28 తేదీల్లో టిడిపి వార్షిక సమావేశం మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఆ సభ రాజమండ్రిలో నిర్వహించాలన్నది పార్టీ పెద్దల నిర్ణయం. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం, వారిలో ఉత్సాహం నింపడంతోబాటు అధికారపక్షాన్ని దునుమాడే లక్ష్యంతో ఈ మహానాడును మరింత ఘనంగా నిర్వహించాలన్నది టిడిపి ప్లాన్. ఈ సభ నుంచి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం.. వారిలో చైతన్యాన్ని రగిలించడం లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు వంద ఎకరాల్లో సభను నిర్వహిచాలన్నది పార్టీ అభిమతంగా ఉంది. అయితే రాజమండ్రిలో మహానాడు కానీ భారీగా సక్సెస్ అయితే టిడిపికి కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, క్యాడర్ లో జోష్ వస్తుందని, అలాంటి వాటికీ అవకాశం ఇవ్వరాదన్న భావనతోనే రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని మామ అప్పారావును, భర్త వాసును అరెస్ట్ చేసి కుటుంబాన్ని కాస్త చికాకుపర్చే ఉద్దేశ్యంతోనే ఈ అరెస్టులు చేసారని టిడిపి క్యాడర్ భావిస్తోంది. సరిగ్గా నెల రోజులు టైం మాత్రమే మహానాడుకు ఉంది. ఈలోపు వారికి బెయిల్ తెచ్చుకోవడం, కోర్టుల చుట్టూ తిరగడంతోనే ఎమ్మెల్యే భవానికి సరిపోతుంది.
ఇక పార్టీ నాయకులతో సమావేశాలు, మహానాడు ఏర్పాట్ల మీద చర్చలు, సమీక్షలు వంటి వాటికి టైం దొరకదని, స్థానిక ఎమ్మెల్యే సహకారం లేకుండా అక్కడ భారీ సభ సక్సెస్ చేయడం కష్టం. బయటి నుంచి వచ్చిన నాయకులూ మహానాడును సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోవచ్చు.. అదే భవాని, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు యాక్టివ్ పార్ట్ తీసుకుంటే మహానాడు సక్సెస్ అవుతుంది. అలా సక్సెస్ కాకూడదు అని, లోకల్ ఎమ్మెల్యే కుటుంబాన్ని చికాకు పర్చే ఉద్దేశ్యంతోనే చిట్ ఫండ్ కేసులో వారిని అరెస్ట్ చేసి మహానాడును డిస్టర్బ్ చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది..