Site icon vidhaatha

టీడీపీ నేత వర్ల రామయ్యకు.. రైతు భరోసా అందజేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఉన్నమాట: కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. ప్రాంతం చూడం.. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం అని చెబుతూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు చెప్పినట్లే టీడీపీ నాయకీడికి కూడా రైతు భరోసా పథకాన్ని అందించింది. టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పొద్దున లేస్తే జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద పాలన మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు.

ఏ టీవీ ఛానెల్ చూసినా చర్చా కార్యక్రమాల్లో ఆయనే కనిపిస్తూ జగన్ పాలనను దునుమాడుతుంటారు. అయినా సరే వర్ల రామయ్యకు సైతం రైతు భరోసా కింద రూ.13500 అందజేశారు. ఈమేరకు వర్ల రామయ్య సతీమణి జయప్రదకు ధృవీకరణ పత్రాన్ని అందించేందుకు వైసీపీ మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ఇంటికి వెళ్లారు.

అయితే.. ఆ సమయంలో వర్ల రామయ్య ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు రాలేదని అంటున్నారు. దాంతో ఆ పధకానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని ఆయన కారు డ్రైవర్ కి వెల్లంపల్లి ఇచ్చేసి వచ్చారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అర్హత ఉంటే చంద్రబాబు మనవడు దేవాన్ష్ కి కూడా అమ్మ ఒడి పథకం ఇస్తామని, అయితే తెల్ల రేషన్ కార్డు ఉండాలని అన్నారు.

గత టీడీపీ హయాంలో అయితే తమ సానుభూతి పరులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ పథకాలు అమలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీల ఓటర్లను పథకాల జాబితా నుంచి తొలగించిన దాఖలాలూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి రాగ ద్వేషాలకు తావులేకుండా ప్రత్యర్థి పార్టీ వారికి సైతం పథకాలు వర్తింపజేయడం జగన్ పాలనకు మచ్చుతునక అని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.

Exit mobile version