Site icon vidhaatha

లోక్‌సభ బరిలో తమిళిసై? తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా

విధాత‌: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందర్‌ రాజన్‌ సోమవారం రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె పంపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున తమిళనాడులోని ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి.


2019 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. తనకు ఎన్నికల రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నదని ఫిబ్రవరి నెలలో పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ‘ప్రజా ప్రతినిధిగా ఉండాలన్నది నా కోరిక. కానీ.. ప్రధాని, హోం మంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’ అని ఆమె తన మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రాజ్‌నివాస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తన మనసులో మాట బయటపెట్టారు.


గవర్నర్‌గా నియమితురాలు కావడానికి ముందు తమిళిసై రెండు దశాబ్దాలకుపైగా బీజేపీ నాయకురాలిగా పనిచేశారు. ఆమె సీనియర్‌ కాంగ్రెస్‌వాది కుమారి అనంతన్‌ కుమార్తె. తమిళనాడులో ప్రభావవంతమైనదిగా భావించే నాగర్‌ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె సెంట్రల్‌ చెన్నై లేదా పుదుచ్చేరి నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో ఉన్న సమయంలో ఆమె రాజీనామా చేయడం గమనార్హం.

Exit mobile version