Site icon vidhaatha

Telangana | రేషన్‌ డీలర్ల కమిషన్‌.. 1400కు పెంపు

Telangana

విధాత: రేషన్ డీలర్ల కమీషన్ మెట్రిక్ టన్నుకు 1400కు పెంచుతున్నట్లు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మంగళవారం సచివాలయంలో నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు, రేషన్ డీలర్ల సంఘం గౌరవధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతల సమక్షంలో జరిపిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కమీషన్‌ పెంచుతున్నట్లు మంత్రులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు నుండి 7 రెట్లుగా 200 నుండి 1400కు కమీషన్‌ పెంచిన ఘనత కేసీఆర్‌ దేనని అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్ది జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 139 కోట్ల అధనపు భారం పడుతుందన్నారు.

ఏకమొత్తంగా కమీషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు.
సానుకూలంగా స్పంధన

రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు 5లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతి డీలర్‌ను తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్షిప్ రెన్యూవల్ని 5 ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్షిప్ వయో పరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంపు, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం 10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్ను కేసుల పరిధి నుండి తీసివేయడం, హైదరాబాద్ లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై సానుకూలంగా స్పంధించినట్లు రేషన్‌ డీలర్ల జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

డీలర్ల కమిషన్ పెంపు సహా తమ ఇతర సమస్యల పరిష్కారించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. తమ కడుపునిండా పెట్టేలా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ లకు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు సమావేశంలోనే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version