విధాత, వెబ్ డెస్క్: ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) నియోజకవర్గాన్ని బీజేపీ అభ్యర్థి(BJP candidate) చిన్నమైల్ అంజిరెడ్డి(Chinnamail Anji Reddy) ఘన విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి (Congress opponent) ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి (Alfors Narender Reddy) పై 5,106ఓట్లతో గెలుపొందారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా హోరాహోరీ పోరులో అంజిరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది.
ఇప్పటికే ఈ నెల 3న వెలువడిన ఇదే జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన మల్క కొమురయ్య గెలుపొందారు. దీంతో ఉత్తర తెలంగాణలోని కీలకమైన రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీజేపీ రాజకీయంగా గణనీయ పురోగతి సాధించినట్లయ్యింది. అయితే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి బీజేపీకి ఈ జిల్లాలో రాజకీయ విస్తరణ ఆశలను కొంత నీరుగార్చింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలుండగా 76 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఇక్కడ గమనార్హం.
కాంగ్రెస్ తో ముఖాముఖీ పోరులో బీజేపీ పైచేయి సాధించడంలో బీఆర్ఎస్ ఓటర్ల పాత్ర ఎంతన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉమ్మడి మెదక్-నిజామాబాద్ ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లా పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ విజయం సాధించడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీ ఆశలు మరింత బలపేతమైనట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి బీజేపీకి ఈ జిల్లాల్లో ఎలా బలపడాలన్న దానిపై ఆత్మవిమర్శ సాధనంగా చెప్పవచ్చు.
ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలుగానే చెప్పవచ్చు. ఉమ్మడి మెదక్-నిజామాబాద్ ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల పరిధిలో పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ కుమార్ గౌడ్ సహా ఏడుగురు మంత్రులు, 23మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి..స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినప్పటికి హోరాహోరీ పోరులో కాంగ్రెస్ కు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిలోనూ ఓటమి తప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు పరిణామాల్లో ఎలాంటి మార్పులకు బాటలు వేస్తాయన్నది వేచి చూడాలి.