Junior Lecturers | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూనియర్ లెక్చరర్ (Junior Lecturers) పోస్టుల భర్తీకి తొలిసారి గతేడాది డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జేఎల్ (JL) నియామక పరీక్షా ప్రశ్నాపత్రంపై రాష్ట్ర హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించబోయే పేపర్ -2 ప్రశ్నాపత్రాన్ని కూడా తెలుగు భాష(Telugu Language)లో ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పేపర్ -2ను ఇంగ్లీష్ భాషలోనే ఇవ్వాలన్న టీఎస్‌పీఎస్సీ(TSPSC) నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పేపర్ -2ను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని కోర్టు ఆదేశించింది.
టీఎస్‌పీఎస్సీ ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని కోర్టు మందలించింది. ఈ జేఎల్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. అయితే జేఎల్ ఎగ్జామ్‌ను రెండు పేపర్లతో నిర్వహించనున్నారు.
మొదటి పేపర్ జనరల్ స్టడీస్ కాగా, రెండో పేపర్ సంబంధిత సబ్జెక్ట్. లాంగ్వేజ్ పోస్టులకు సంబంధించి పేపర్ -2 వారి వారి లాంగ్వేజ్‌లోనే నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది టీఎస్‌పీఎస్సీ. ఇక మిగతా సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ -2 పరీక్షకు కేవలం ఇంగ్లీష్ భాషలోనే నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతో పలువురు తెలుగు మీడియం అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, ఇవాళ కీలక తీర్పు వెల్లడించింది.