Site icon vidhaatha

CM Revanth Reddy: పెట్టుబడులకు తొలి ఎంపిక తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైజింగ్ తో వన్ ట్రిలియన్ సాధన
గూగుల్  ఒక వినూత్న సంస్థ..మాది ఒక వినూత్న ప్రభుత్వం
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ తో ఉద్యోగ అవకాశాలు
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం గూగూల్ లో శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందని..గూగూల్ సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రేవంత్ రెడ్డి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ను రాష్ట్రంలో ప్రారంభించడం నాకు సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రపంచంలో నాల్గవది మాత్రమేనని..గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందన్నారు. నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ ఆధారితమయ్యాయని..మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయన్నారు. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందాల్సివస్తుందన్నారు. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతామని..అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నానని తెలిపారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుందని..ఉపాధిని సృష్టించడంతో పాటు  దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం..ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నానని తెలిపారు. గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయి.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలని సూచించారు. దీనినే మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామని..దీంతో 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.

గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులు

గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులు అని..2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు.  దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా  అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నామని తెలిపారు. గూగుల్  ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ట్రాన్సజెండర్స్ ని నిర్లక్ష్యం చేశాయన్నారు. జీహెచ్ఎంసీ కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకుంటోందని తెలిపారు. మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను  చేయాలనుకుంటున్నామని..గూగుల్ ఆఫీస్ పక్క ని రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నామన్నారు. మేము మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు  వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నామన్నారు. వీటన్నిటికీ, నాకు మీ మద్దతు అవసరమని కోరారు. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నానన్నారు.

నైపుణ్యాభివృద్ధికి యూనివర్సిటీ

నాణ్యమైన విద్య మా లక్ష్యమని..ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ లో ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్ ల నుంచి వస్తున్నారని..అయితే చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని..అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం అని..ఇవే నా ప్రధాన ఆవిష్కరణలు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు., గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన  మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నానన్నారు. గూగుల్, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దామని రేవంత్ రెడ్డి సూచించారు.

Exit mobile version