Site icon vidhaatha

మంత్రులు డ‌మ్మీ.. పేషీలు నిర్వీర్యం!

ప్రగతిభవన్‌! కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్మించిన భవనం! అయితే.. ఇందులోకి వెళ్లాలన్నా, ముఖ్యమంత్రిని కలవాలన్నా ప్రజలకు, ఇతర రాజకీయ పార్టీల నేతలకు అవకాశం లేదన్న చర్చ ఈనాటిది కాదు! వారికే కాదు.. కొందరు అమాత్యులకు కూడా ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ దొరకడం లేదట! ఈ విషయాన్ని వారు తమ సన్నిహితుల వద్ద చెప్పుకొని వాపోతున్నారని సమాచారం!

విధాత‌, హైద‌రాబాద్‌: ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ ఎవరైనా సరే.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ నుంచి పిలుపు వస్తేనే వెళ్లాలి తప్ప వారంతట వారు వెళ్లలేని పరిస్థితి ఉన్నదనే అభిప్రాయాలు చాలాకాలంగానే ఉన్నాయి. ప్రజాప్రతినిధులే కాదు.. ఆఖరుకు కొందరు మంత్రులది కూడా అదే పరిస్థితి అని చెబుతున్నారు. సాధారణంగా మంత్రులు ముఖ్యమంత్రితో దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఉంటుంది.



అయితే.. కొందరు మంత్రులకు మాత్రమే ఇది మినహాయింపు అని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైన మంత్రులు, కీలక నేతలు మినహా మరెవరూ లోనికి ప్రవేశించే అవకాశం లేదని చర్చ జరుగుతున్నది. బీఆరెస్‌ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో మునుపెన్నడూ లేనంతగా మంత్రులు డమ్మీలు అయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయ పరిశీలకుల మధ్య కాదు.. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య కూడా ఇదే అభిప్రాయం ఉన్నదని బీఆరెస్‌ నాయకుడు ఒకరు చెప్పారు.



బీఆరెస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంను కలవడానికి వెళ్లలేని స్థితి ఉన్నదని అంటున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌న్నిహితుడిగా పేరు గాంచిన ఒక మంత్రి ఇటీవ‌ల త‌న స‌న్నిహితుల‌ వ‌ద్ద తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. సార్ చెప్పిన ప‌ని చేయ‌డానికి మాత్ర‌మే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపిస్తారు కానీ, మేం మా ప‌నులు చేయించుకోవ‌డానికి అక్కడకు వెళ్లలేమని, వెళ్లినా అడ‌గ‌లేమ‌ని వాపోయినట్టు తెలిసింది. మంత్రే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో వారు ఒక్క‌సారిగా నిశ్చేష్టులయ్యారని స‌మాచారం.




ఇది తన ఒక్క‌డి ప‌రిస్థితే కాదని, మిగిలిన నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉన్నదని ఆయన చెప్పారని తెలిసింది. తాను ప్రొటోకాల్‌ ఉన్న మంత్రిని కాబట్టి ప్రగతిభవన్‌లోనికి వెళ్లటానికి ప్రయత్నించినా.. లోనికి మాత్రం ప్రవేశానికి అనుమతి లభించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.



గ‌తంలో ఒకరిద్ద‌రు మంత్రులు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా సీఎం అనుమ‌తి లేద‌ని బ‌య‌టి గేటు నుంచే పంపించి వేశార‌ని స‌మాచారం. ఎంత పెద్ద మంత్రి అయినా సీఎం వ‌ద్ద‌కు వెళ్లి శాఖ ప‌ర‌మైన‌ది కానీ, వ్య‌క్తిగ‌త‌మైనది కానీ ఏ ప‌ని అయినా చేయాల‌ని కోరే పరిస్థితి ఉండ‌ద‌న్నచ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో ఉంది. కేవ‌లం ఆయ‌న చెప్పిన ప‌ని చేయ‌డానికే కానీ, ప‌ని చేయించుకోవ‌డానికి వెళ్ల‌లేర‌ని అంటున్నారు.

పేషీల్లోనూ అంతే!


మంత్రులే కాదు.. మంత్రుల పేషీల ప‌రిస్థితి కూడా అలాగే ఉందని అధికారవర్గాలు అంటున్నాయి. సీఎం వద్ద తమ పని కాదనే అభిప్రాయంతో వారంతా నియోజకవర్గాల్లోనే ఉంటున్నారని, సీఎం నుంచి పిలుపు వస్తేనే హైదరాబాద్‌కు వస్తున్నారని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. దీంతో స‌చివాల‌యంలో మంత్రుల పేషీలు కూడా డ‌మ్మీలుగా మారాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.



స‌చివాల‌యంలో మెజార్టీ మంత్రుల కార్యాల‌యాల‌న్నీ బోసిపోయి క‌నిపిస్తున్నాయ‌ని స‌చివాల‌య సంద‌ర్శ‌కుడొక‌రు అన్నారు. దీంతో స‌చివాల‌య అధికారుల్లో కూడా నిర్వేదం నెలకొన్నదని చెబుతున్నారు. పై నుంచి ఆదేశాలు వ‌స్తేనే.. సంబంధిత ఫైల్‌ మాత్రమే కదులుతుందని, మిగ‌తా ఫైళ్లు క‌ద‌ల‌డం క‌ష్ట‌మ‌ని ఒక అధికారి అన్నారు. దీంతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.



వెరసి పాల‌న కుంటు ప‌డింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నది. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి ఫ్రీ యాక్సెస్ లేద‌న్న చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గాల‌లోని పార్టీ క్యాడర్‌లో కూడా జరుగుతున్నదని ఒక నాయకుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ఎమ్మెల్యేకు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో గౌర‌వం లేకుంటే త‌మ‌కు కూడా లేన‌ట్లుగానే భావిస్తున్నార‌ని స‌మాచారం.

Exit mobile version