ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం..టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారికంగా పోలీసులు ట్యాపింగ్ కేసును నమోదు చేశారు

  • Publish Date - March 29, 2024 / 05:18 PM IST

ఈ తరహా కేసు దేశంలోనే తొలిసారి

రాధాకిషన్‌రావుకు 14 రోజు రిమాండ్‌

చంచల్‌గూడ జైలుకు తరలింపు

ట్యాపింగ్‌లో కొనసాగుతున్న విచారణ

ఢిల్లీకి పాకిన ట్యాపింగ్‌ వ్యవహారం

కేంద్రం నిర్ణయాలపై ఆరా తీసేందుకు

పలువురు బీజేపీ నేతల ఫోన్లపై నిఘా

విధాత, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారికంగా పోలీసులు ట్యాపింగ్ కేసును నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్టులోని 1885వ సెక్షన్ కింద నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదైన కేసు ఇదేనని పోలీసులు చెబుతున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద మెమో దాఖలు చేయడంతో కేసు మునుముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులు పెడితే తక్కువ శిక్షలు, జరిమానాలు ఉంటాయని భావిస్తున్న అధికారులు ట్యాపింగ్‌తో సాగించిన బ్లాక్ మెయిల్స్‌, వ్యవస్థీకృత నేరాల ఆధారంగా చేసిన వసూళ్లపై కేసులు పెట్టి చట్టపరంగా గట్టి చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కేసులో మునుముందు పలువురు బీఆరెస్ నేతలను కూడా విచారణకు పిలిచే అవకాశముందని సమాచారం.

రాధాకిషన్‌రావుకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్సు డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్‌డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి బంజారాహిల్స్ స్టేషన్‌లో రాధాకిషన్ రావును విచారించిన దర్యాప్తు బృందం.. శుక్రవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించడంతో చంచల్‌ గూడ జైలుకు తరలించారు. ఈ కేసు విచారణలో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అదేశాలతోనే తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సీఐ గట్టు మల్లు విచారణలో తెలిపారని సమాచారం. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్ 2 వరకు ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావును కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు బంజరాహిల్స్‌లో విచారణకు హాజరవుతున్న టాస్క్‌ఫోర్స్‌, ఎస్ఐబీకి చెందిన నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, పలువురు కానిస్టేబుల్స్ స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నారు.

ప్రభుత్వ పెద్దల అండతో వసూళ్లు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకింది. ఇప్పటికే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు ట్యాపింగ్‌తో సాగించిన దందాలు వెలుగులోకి రాగా, తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ మాదిరి విభాగానికి (ఎస్‌వోటీ) ఇన్‌చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్‌ క్యాడర్‌ అధికారియైన డీసీపీ ఆ కమిషనరేట్‌లో రియల్‌ ఎస్టేట్‌ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. సదరు అధికారి తన టీమ్‌తో కలిసి రూ.కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పరంగా కీలకమైన జోన్లు కావడంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసి, విధేయతను చాటుకున్నారని సమాచారం. సదరు డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు కావడంతో.. సీపీ స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని భావిస్తున్నారు. ఎస్‌ఐబీలో సేవలందించిన 15 మంది అధికారులు, సిబ్బందికి ఈ కేసుతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరంతా ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్‌లో పాతుకుపోయినట్లు తెలుస్తోంది. కొందరైతే ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసినా.. ఓఎస్డీలుగా కొనసాగారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో వీరు కూడా కీలక పాత్రధారులు అని తెలుస్తోంది. ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పక్క రాష్ట్రాలను కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ఢిల్లీకి పాకిన ట్యాపింగ్ ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఢిల్లీ దాకా సాగిందని తెలుస్తుంది. ఢిల్లీలోని కొంత మంది మంత్రులు, వారి కార్యాలయ సిబ్బందితో పాటు బీజేపీ ముఖ్య నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించిందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏయే అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? దానికి మనం ఏం నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ముందుగానే అవగాహన కోసం ట్యాపింగ్ చేశారని సమాచారం. రాష్ట్రానికి చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కేంద్ర మంత్రులతో ఏం చర్చిస్తున్నారన్నదానిపై కూడా నిఘా పెట్టారని దర్యాప్తు అధికారులు నిర్ధారించుకున్నారని తెలుస్తోంది.

Latest News