Site icon vidhaatha

Temparature | భానుడి భగభగలు.. 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. క్లైమేట్‌ సెంట్రల్‌ శాస్త్రవేత్తల వెల్లడి

Temparature : దేశంలో ఎండలు మండుతున్నాయి. భానుడు భగ్గుమంటున్నాడు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ కానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో మహారాష్ట్ర, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మాత్రమే మార్చి నెలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈసారి దేశం అంతటా మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటనున్నాయి. ఈ విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తల బృందం ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ వెల్లడించింది.

ఈ బృందం 1970 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నుల్ని విశ్లేషించింది. ఆ విశ్లేషణలో వెల్లడైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర భారతం సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1970లతో పోలిస్తే సగటు ఉష్ణోగ్రతలు జమ్మూకశ్మీర్‌లో 2.8, మిజోరంలో 1.9 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.


దేశంలోని 51 నగరాల్లో ఈ రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. సాధారణంగా మార్చి నెలలో వడగాలులు రావడం చాలా అరుదని ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఆండ్య్రూ పర్షింగ్‌ చెప్పారు. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం మార్చిలోనే వడగాలులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈసారి కూడా వడగాలులు మొదలయ్యే అవకాశం ఉందన్నారు. వేసవి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన సూచించారు.


ఎందుకిలా..?


ఉష్ణోగ్రతల్లో పెరుగుదలకు, వడగాలులు వీయడానికి వాతావరణ పరిస్థితుల్లో మార్పులే కారణం. కర్బన ఉద్గారాలతో వాతావరణం వేడెక్కుతోంది. దేశంలో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పట్టణాలు, నగరాలు పెరగడం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, కాలుష్య ఉద్గారాలు అధికం కావడం ఇందుకు కారణాలు. వాతావరణాన్ని చల్లబరచడమే సమస్యకు పరిష్కారం. ఇందుకోసం పచ్చదనం పెరగాలి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించగలగాలి.

Exit mobile version