- పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద ఉద్రిక్తత
- రైతుల కొత్త డిమాండ్లపై కేంద్రమంత్రి అసహసం
- పతంగులతో డ్రోన్లను కూలుస్తున్న రైతులు
న్యూఢిల్లీ: రైతుల ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్ పెడుతున్నారు. గాలిపటాలు ఎగురవేసి డ్రోన్లను అడ్డుకుంటున్నారు. గాలిపటాల దారాలు డ్రోన్లకు చుట్టుకోవడంతో కొన్ని కూలిపోయాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రైతులను చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. టియర్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్స్‌తో దుస్తులు తడిగా ఉంచుకుంటున్నారు. అలాగే టియర్ గ్యాస్ ప్రభావం నుంచి రక్షణ కల్పించే దుస్తులు ధరిస్తున్నారు. కనీస మద్దతు ధర ( ఎంఎస్పీ) , వ్యవసాయ సంస్కరణలకు చట్టపరమైన హామీతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి ఢిల్లీ బాటపట్టారు.
రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు ఢిల్లీలో అడుగుడుగునా భద్రతా ఏర్పాట్లు చేయడం, సెంట్రల్ ఢిల్లీతో హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ఆంక్షలు విధించడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ భద్రత, కాంక్రీట్ బారికేడ్లను కూడా లెక్కచేయకుండా రైతులు ఛలో మార్చ్ కొనసాగిస్తుండటంతో శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. శంభు సరిహద్దు ప్రాంతం పంజాబ్‌లోనే ఉన్నప్పటికీ హర్యానా నుంచి డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారంటూ పంజాబ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే శంబు సరిహద్దుల్లో రైతులు పెద్దఎత్తున గుమిగూడటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు పంజాబ్ పరిధిలో ఉన్నందున డ్రోన్లు మోహరించకుండా సంయమనం పాటించాలని అంబాలా డిప్యూటీ కమిషనర్‌కు పాటియాలా డిప్యూటీ కమిషనర్ షౌకత్ అహ్మద్ పార్రే ఒక లేఖ సైతం రాశారు. కాగా, తాము పంజాబ్ ప్రాంతంలోనే ఉన్నప్పటిక మానవ రహిత వాహనంలో గ్యాస్ కేనిస్టర్లను వదులుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పార్రే ధ్రువీకరించారు. సరిహద్దుల వెంట డ్రోన్ల కదలికలను నియంత్రించాలని తాము కోరినట్టు చెప్పారు. ఈ క్రమంలో రైతులు శంభు సరిహద్దుల్లో డ్రోన్లు ఎగురకుండా పంతగులు ఎగురవేస్తున్నారు.
చర్చలకు సిద్ధంగా ఉన్నాం- కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రైతుల ఛలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధాని సరిహద్దులను మూసివేశారు. నగరంలోకి రైతులను రానివ్వకుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే, రైతుల నిరసనపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చిన నేపథ్యంలో రాష్ట్రాలతో చర్చించేందుకు సమయం కావాలన్నారు. రైతు నాయకులు వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు.
వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించేందుకు, రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అనేక చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రాలతో చర్చలకు సమయం కావాలి.. చర్చలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. డిమాండ్లు చాలా వరకు ఆమోదించబడ్డాయన్న ఆయన.. అయితే, కొత్త డిమాండ్లపై చర్చించేందుకు మరింత సమయం కావాలన్నారు. విధ్వంసం, హింసకు పాల్పడొద్దని ఆందోళనకారులను అభ్యర్థించారు. రైతు నాయకులు వచ్చి చర్చించాలని కోరుతున్నానన్నారు.
రైతులతో సంప్రదింపులకు కేంద్రం సిద్ధం : మంత్రి అర్జున్ ముండా
రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు.