విధాత : శివ సేన పార్టీ అధినేత బాల్ థాకరేకు అత్యంత సన్నిహితుడైన చంపా సింగ్ థాపాతో పాటు మోరేశ్వర్ రాజే సీఎం ఏక్‌నాథ్ షిండే చెంతకు చేరారు. సోమవారం షిండే వారిద్దరిని సాదరంగా ఆహ్వానించి, శాలువాలతో సత్కరించారు.
మాతో శ్రీ నివాసంలో బాల్ థాకరేకు మూడు దశాబ్దాలకు పైగా చంపా సింగ్ సేవలందించారు. థాకరే చివరి రోజుల్లో కూడా సింగ్ దగ్గరుండి అన్ని చూసుకున్నారు. 27 ఏండ్ల పాటు ఓ భక్తుడిలా సింగ్ థాకరేకు సేవలందించి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. థాకరేకు విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నాడు థాపా. థాకరే అంత్యక్రియల్లోనూ ఉద్ధవ్ థాకరే.. థాపాను తన పక్కనే ఉంచుకున్నారు. అంతగా ఆ కుటుంబానికి దగ్గరైన వ్యక్తి థాపా.
బాల్ థాకరే ఫోన్ కాల్స్ అన్నింటిని థాపానే చూసుకుని, అధినేతకు సమాచారం అందించేవాడు. ఇక మోరేశ్వర్ రాజే కూడా థాకరే అత్యంత సన్నిహితుడు. రాజే ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని థాకరే నివాసంలో 35 ఏండ్ల పాటు సేవలందించాడు. థాపా, రాజే బాల్ థాకరేకు నీడలాంటి వారు. అలాంటి ఇద్దరు వ్యక్తులు.. ఉద్ధవ్ థాకరేను వదిలి షిండే వర్గంలో చేరిపోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.