Site icon vidhaatha

స్వగ్రామం చేరుకున్న డాక్టర్ ప్రీతి మృతదేహం.. మరికాసేపట్లో అంత్యక్రియలు

విధాత: వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన కేఎంసీ పీజీ మెడికో డాక్టర్ ప్రీతి మృతదేహాన్ని పోలీస్ భద్రత మధ్య ఆమె స్వస్థలం గిర్ని తండాకు తరలించారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.

డాక్టర్ ప్రీతి ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు విషయం తెలిసిందే. ప్రీతి మృతి పై విద్యార్థి, యువజన, రాజకీయ పార్టీలు నిమ్స్ వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి వరంగల్ కేఎంసి వద్ద విద్యార్థి సంఘాలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిమ్స్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీతి మృతిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అనంతరం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో ప్రీతి మృతదేహానికి శవపరీక్ష పూర్తి చేసి తమ స్వస్థలానికి పంపించారు.

– గిర్ని తండాకు ప్రీతి మృతదేహం

స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకి ప్రీతి మృతదేహం సోమవారం ఉదయం చేరుకుంది.గిర్ని తండా గ్రామానికి చేరుకున్న మెడికో ప్రీతి మృతదేహానికి గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు సందర్శించి నివాళులు అర్పించారు. బంధుమిత్రుల సమక్షంలో డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

– కేఎంసీ వద్ద భారీ బందోబస్తు

ప్రీతి మృతి సంఘటన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం ఎవరినైనా లోపలికి అనుమతిస్తున్నారు.

Exit mobile version