- పంట రక్షణ కోసం ఏర్పాటు చేస్తే ప్రాణాలు పోయాయి
- మహబూబాబాద్ జిల్లా దుమ్లా తండాలో విషాదం
పంట రక్షణ కోసం కరెంటుతో కంచె పెడితే ఇంటి దీపాలు రెండు ఆరిపోయాయి. పెట్టిన కరెంటు శాపమై షాక్ కొట్టి తండ్రి, కొడుకుల ప్రాణాలు బలి తీసుకున్న విషాద సంఘటన (Mahabubabad) మహబూబాబాద్ జిల్లా లో మంగళవారం జరిగింది. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర విషాదం మిగిల్చింది.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పంట కోసం పెట్టిన కరెంటు వైర్లు తగిలి తగిలిన దుర్ఘటనలో మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుమ్లా తండాకు చెందిన తండ్రి కొడుకులు (father & son) ఆంగోతు సీవీ నాయక్ (55), కిరణ్(29)లు విగత జీవులయ్యారు. ఇంటి ఆధారం కోల్పోయి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కొడుకును కాపాడబోయి తండ్రి కూడా మృత్యువాత
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీవీ నాయక్ మూడెకరాల్లో మొక్కజొన్న పంట (Maze crop)వేశారు. పంటను కోతుల నుంచి రక్షించుకునేందుకు విద్యుత్ వైర్లు అమర్చారు. మంగళవారం తెల్లవారుజామున కోతుల కాపాలకు ఆంగోతు సీవీ నాయక్ కొడుకు కిరణ్‌తో కలిసి పంట కాపాలకు వెళ్లారు.ఈ క్రమంలో కిరణ్ ప్రమాదవశాత్తు కరెంటు వైరుపై (current wire)పడిపోయాడు.
కొడుకును రక్షించేందుకు సీవీ నాయక్ వెళ్లగా ఆయన సైతం కరెంటు షాక్ కొట్టి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. కిరణ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. తండ్రీకొడుకుల మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తండ్రీ కొడుకులను బలి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.