Site icon vidhaatha

ప్రకృతి బలోపేతంతోనే మానవాళి సుభిక్షం!

విధాత‌: గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రకృతితో మనిషికి ఏర్పడిన అగాథం మూలంగా మానవాళి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఉప్పల వెంకటేష్ గుప్తా, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌బీహెచ్‌ రంగయ్య అన్నారు.

జూన్ 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో జవహర్‌లాల్‌ భవన్‌లో పర్యావరణం, ప్రకృతి అంశాలపై నగరవ్యాప్తంగా పలు పాఠశాలల విద్యార్థులకు వ్యాస‌, చిత్ర లేఖ‌న పోటీ ప‌రీక్ష‌లు నిర్వహించారు.

కార్య‌క్ర‌మంలో వెంకటేష్ గుప్తా, రంగయ్య మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న వనరులను విపరీతంగా వాడటంతోపాటు మనుషులు తమ స్వార్థం కోసం విపరీతంగా చెట్లను నరికివేయడం, పెరుగుతున్న కాలుష్యాలతో పర్యావరణం పెను విధ్వంసానికి గురవుతున్నదని పేర్కొన్నారు. ప్రకృతి నుంచి ఇన్ని తీసుకుంటున్న మనిషి.. ప్రకృతికి తిరిగి ఇవ్వాలన్న కనీస ధర్మం మరువడం వల్లే అనర్థాలు రాజ్యమేలుతున్నాయని వారు పేర్కొన్నారు.

చెట్ల సంరక్షణ, కాలుష్య నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలను చైతన్యం చేయడమే తొలి ప్రాధామ్యంగా పనిచేయాలని వారు సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కట్టడికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రేపటి తరం పచ్చగా ఉండాలంటే ఈ తరం పర్యావరణం పట్ల బాధ్యతగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి ముఖ్య అతిథిగా హాజరుకాగా జలమండలి డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్ ఫారెస్టు కొండా మోహన్ (డీఎఫ్‌వో), సీనియర్ పాత్రికేయులు, బీవీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Exit mobile version