Site icon vidhaatha

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు మార్చి 12 లోపు వెల్లడించాల్సిందే


న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడికి సర్వోన్నత న్యాయస్థానం విధించిన గడువును పొడిగించాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 11, 2024) కొట్టివేసింది. అవసరమైన సమాచారం ఇప్పటికే ఎస్‌బీఐ వద్ద ఉన్నదని పేర్కొంటూ.. మార్చి 12వ తేదీ పనివేళలు ముగిసే లోపు సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించింది. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో మార్చి 15, 2024 సాయంత్రం ఐదు గంటలకల్లా ప్రదర్శించాలని పేర్కొన్నది.


అనామక ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ వ్యతిరేకమని, సమాచార హక్కు చట్టం, 19 (1) (ఏ) అధికరణం కింద ఉల్లంఘనేనని పేర్కొంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. 2019 ఏప్రిల్‌ 12 నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను 2024, మార్చి 6 నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని అదే తీర్పులో ఆదేశించింది. అయితే బాండ్ల వివరాలు క్రోడీకరించడంలో ఉన్న సంక్లిష్టత కారణంగా జూన్‌ 30 వరకు.. అంటే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత వరకు గడువు పొడిగించాలని ఎస్‌బీఐ తాజాగా పిటిషన్‌ దాఖలు చేసింది.


ఈ పిటిషన్‌తోపాటు.. బాండ్ల వివరాలు వెల్లడించకపోవడంపై ఎస్‌బీఐకి వ్యతిరేకంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) దాఖలు చేసిన కోర్టు ఉల్లంఘన పిటిషన్‌ల పైనా చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.


సరిపోల్చే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో జాప్యం


ఎస్‌బీఐ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే దాత వివరాలు, బండ్ల జారీ వివరాలు వేర్వేరుగా భద్రపర్చి ఉన్నాయని, వాటిని సరిపోల్చే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో జాప్యం జరుగుతున్నదని కోర్టుకు తెలిపారు. దీనికి సీజేఐ చంద్రచూడ్‌ స్పందిస్తూ.. సరిపోల్చే ప్రక్రియ నిర్వహించాలని కోర్టు కోరడం లేదని, కేవలం వివరాలు వెల్లడిస్తే సరిపోతుందని అన్నారు. కేవైసీ రికార్డుల ఆధారంగా బ్యాంకు అవసరమైన వివరాలన్నింటినీ కలిగి ఉన్నదని చీఫ్‌ జస్టిస్‌ పేర్కొన్నారు. దీని ద్వారా.. ఏ బాండ్లు ఏ రాజకీయ పార్టీకి వెళ్లాయో ఎస్‌బీఐ వెల్లడించాల్సిన అవసరం లేదని అన్నారు.


ఈ 26 రోజులలో ఏం చేశారు?


తమ ఆదేశాలు జారీ అయిన ఈ 26 రోజులలో సాధించిన ప్రగతిపై ఎస్‌బీఐ మౌనాన్ని కోర్టు ప్రశ్నించింది. పురోగతికి సంబంధించిన వివరాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పిస్తామని హరీశ్‌ సాల్వే కోర్టుకు హామీ ఇచ్చారు. ‘మా తీర్పు ఫిబ్రవరి 15వ తేదీన జారీ అయింది. ఈ రోజు మార్చి 11. గడిచిన 26 రోజుల్లో ఏం మేరకు సరిపోల్చే ప్రక్రియ నిర్వహించారు? అఫిడవిట్‌లో ఈ అంశాలు లేవు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి మేం ఒక మేరకు నిష్పాక్షికతను ఆశిస్తున్నాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సాల్వే ‘మా దగ్గర ఆ వివరాలు లేవని నేను చెప్పడం లేదు.. మా దగ్గర ఉన్నాయి’ అని బదులిచ్చారు. ఎస్‌బీఐ రికార్డు చేసుకున్న సమాచారం వేర్వేరుగా ఉండటం వల్లే కష్టతరంగా మారిందని పునరుద్ఘాటించారు.


‘ఈ సమాచారం గోప్యంగా ఉండాలని మాకు చెప్పారు. దానితో మేం అందుకు అనుగుణంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఏదైనా తప్పు చేయడం ద్వారా ధ్వంసం చేయాలని అనుకోవడం లేదు’ అని సాల్వే వాదించారు. ‘ఎలాంటి తప్పులు జరిగే ప్రశ్నే లేదు. మీ వద్ద కేవీసీ ఉన్నది. మీరు దేశంలోనే నంబర్‌ వన్‌ బ్యాంక్‌. మీరు ఆ పని చేయగలరనే మేం అనుకుంటున్నాం’ జస్టిస్‌ ఖన్నా అన్నారు. కొనుగోలు చేసిన వివరాలన్నీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సీల్డ్‌ కవర్‌లో ఉన్నాయని బ్యాంకు పేర్కొనగా.. ‘సింపుల్‌గా సీల్డ్‌ కవర్‌ తెరిచి, పేర్లన్నీ రాసి వివరాలు సమర్పించండి’ అని జస్టిస్‌ ఖన్నా సూచించారు. ప్రతి ఎలక్టోరల్‌ బాండ్‌ను కొనుగోలు, కొనుగోలు చేసినవారిపేరు, ఎంత మొత్తానికి కొనుగోలు చేశారు? అనే వివరాలను సమర్పించాలని ఎస్‌బీఐని బ్యాంకు కోరింది.


దీనితోపాటు బాండ్లను క్యాష్‌ చేసుకున్న రాజకీయ పార్టీలు, ఎన్‌క్యాష్‌ మెంట్‌ చేసుకున్న తేదీలను కూడా సమర్పించాలని పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఎస్‌బీఐకి విధించిన మార్చి 12 డెడ్‌లైన్‌ గురించి ఎన్నికల సంఘం ప్రతినిధి స్పందన కోరగా.. ‘నో కామెంట్‌’ అని వ్యాఖ్యానించారు. ఏడీఆర్‌, సీపీఐఎం దాఖలు చేసిన కోర్టు ఉల్లంఘన పిటిషన్‌పై ప్రొసీడింగ్స్‌ నిర్వహించేందుకు నిరాకరించిన కోర్టు.. తమ తాజా ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించని పక్షంలో దానిని చేపడుతామని తెలిపింది. తమ ఆదేశాలు పాటిస్తామని ఎస్‌బీఐ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది.

Exit mobile version