Site icon vidhaatha

CPI | నమ్మంచి మోసం చేశారు.. బీజేపీ, బీఆరెస్‌లను ఓడిద్దాం: సీపీఐ

CPI |

విధాత, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీఆరెస్‌, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని భావించిన సీపీఐ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ఓడించాలన్న నినాదంతో పని చేయాలని నిర్ణయించింది. మొన్నటి వరకు పొత్తు ఉంటుందని భావించిన సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆరెస్‌ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంతో ఖంగుతిన్నాయి. మంగళవారం అత్యవసరంగా ఈరెండు పార్టీల సెక్రటేరియట్‌ సమావేశాలు జరిగాయి. ఉమ్మడిగా సమావేశం కూడా నిర్వహించాయి.

ఆ తరువాత వెంటనే బుధవారం మగ్దుంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సెక్రటేరియట్‌ చేసిన నిర్ణయాలను ఆమోదించింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు బీఆరెస్‌ మనల్ని నమ్మించి మోసం చేసిందని కార్యవర్గం అభిప్రాయ పడింది. ముఖ్యంగా బీఆరెస్‌, బీజేపీ మధ్యఅవగాహన కుదిరిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నా మనం గుర్తించడంలో విఫలమయ్యామన్న అభిప్రాయాన్న కార్యవర్గ సభ్యులు వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో కేసుల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. రహస్య అవగాహనలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేవలం బయటకు మాత్రమే తమ మధ్య పోటీ ఉందన్న ప్రచారం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి.

మతోన్మాద బీజేపీని, ఈ పార్టీతో రహస్య అవగాహన ఉన్న బీఆరెస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలనే నినాదంతో ముందుకు వెళ్లాలి. బలమున్న స్థానాలలో పోటీ చేయాలి. మొదటగా మునుగోడు, కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్‌లలో పోటీ చేద్దాం. ఆతరువాత పరిణామాలను బట్టి నిర్ణయిద్దాం. సీపీఎం పార్టీతో కలిసి పని చేయాలి. వామపక్షాలతో కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుందాం. బీఆరెస్‌, బీజేపీలను ఓడించాలన్న ప్రధాన నినాదంతో ముందుకు వెళదాం.

Exit mobile version