Milk Shakes |
ఐస్‌క్రీం మెషీన్‌ను సరిగా శుభ్రం చేయకపోవడమే కారణం..
విధాత: బ్యాక్టీరియా (Bacteria)తో కలుషితమైన మిల్క్‌షేక్‌లు తాగి.. ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. అమెరికా (America) లోని వాషింగ్టన్‌లో ఉన్న ఫ్రూగల్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన వీరు.. అక్కడి మిల్క్‌షేక్‌లను తాగిన తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ ముగ్గురు కన్నుమూశారు. ఈ ఘటనకు మిల్క్‌షేక్‌లను తయారుచేసే ఐస్‌క్రీం మెషీన్‌ను సరిగా శుభ్రం చేయకపోవడమే కారణమని వాషింగ్టన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది.
దీనవల్ల ఐస్‌క్రీం మెషీన్‌లో ప్రమాదకరమైన లిస్టీరియా (Listeria) అనే బ్యాక్టీరియా వృద్ధి చెందిందని పేర్కొంది. ఫ్రూగల్స్ రెస్టారెంట్లో ఉన్న అన్ని ఐస్‌క్రీం మెషీన్లలోనూ ఈ బ్యాక్టీరియా ఉనికి ఉందని ప్రకటించింది. ఈ నెల 8న ఈ రెస్టారెంట్‌ను అధికారులు మూసేసినప్పటికీ ఒకసారి లిస్టీరియా బ్యాక్టీరియా.. శరీరంలోకి వెళ్లిపోయాక అది 70 రోజుల పాటు తన ప్రభావాన్ని చూపించగలదు.
దీంతో అక్కడ ఐస్‌క్రీంలు, మిల్క్ షేక్‌లు తిన్నవారిని అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం చనిపోయిన, గాయపడిన ఆరుగురూ ఫిబ్రవరి 27 నుంచి జులై 22 మధ్య అక్కడ మిల్కషేక్‌లు తాగినట్లు తెలుస్తోంది. దీంతో మే 29 నుంచి ఆగస్టు 7 మధ్యన ఈ ఫ్రూగల్ రెస్టారెంట్‌కు వెళ్లిన వారికి లిస్టీరియా బ్యాక్టీరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వాషింగ్టన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
లిస్టీరియా అనేది ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్.. కలుషిత ఆహారం (Food Contamination)లో ఉండే బ్యాక్టీరియం లిస్టీరియా మోనోసైటోజైన్స్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఒక్క అమెరికాలోనే ఏటా 16 వేల మంది దీని బారిన పడతారు. వారిలో కనీసం 260 మంది మరణిస్తున్నట్లు అంచనా.. లిస్టీరియా ప్రధానంగా గర్భిణిలను, శిశువులను, వృద్ధులను, వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
మిగతా వారిపై కూడా ఈ బ్యాక్టీరియా దాడి చేసినా.. తీవ్ర అనారోగ్యం కలుగుతుందే తప్ప.. ప్రాణాంతకం కాదు. సాధారణంగా ఈ బ్యాక్టీరియా సోకిన వారికి తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు, నీరసం, తలపోటు, మెడనొప్పి, అయోమయం, పట్టు తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైద్యులను వెంటనే సంప్రదిస్తే తీవ్రతను బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు.
డయేరియా వల్ల నీరసించిపోతే ఫ్లూయిడ్స్ ఎక్కించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. లిస్టీరియా గర్భిణులకు ప్రాణాంతకం.. అంతే కాకుండా నెలలు నిండకుండా ప్రసవం త్వరగా అయిపోవడానికి అది దోహదపడుతుంది. కాబట్టి వారు బయటి ఆహారం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.