Site icon vidhaatha

Top Stars | అప్పట్లోనే.. ఒకే పాటలో టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, కృష్ణంరాజు.. మీరెప్పుడైనా చూశారా!

Top Stars |

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు మ‌ల్టీ స్టార‌ర్స్ హంగామా న‌డుస్తుంది. చిన్న హీరోల‌తో పాటు పెద్ద హీరోలు కూడా మల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అయితే ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో అగ్ర హీరోలు కలిసి ఎప్పుడో నటించారు. ఇప్పుడేదో.. అంద‌రు మల్టీస్టారర్ అని చెబుతున్నారు కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనే ఎన్నోమ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కి క‌నువిందు చేశాయి.

ఇక ఈ సంప్ర‌దాయాన్ని త‌ర్వాతి త‌రం హీరోలు కూడా పాటించారు. టాలీవుడ్ అగ్ర‌హీరోలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున ఒకే సినిమాలో క‌నిపించి అలరించారు. వారితో పాటు శోభ‌న్ బాబు, కృష్ణ‌, కృష్ణంరాజు కూడా కాసేపు క‌నిపించి సంద‌డి చేశారు.

వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్ర ప్రసాద్‌ కాంబినేషన్లో టి.సుబ్బిరామిరెడ్డి సమర్పణలో దర్శకుడు మురళీ మోహన్‌ రావు తెరకెక్కించిన చిత్రం ‘త్రిమూర్తులు’. 1981లో వచ్చిన ‘నజీబ్‌’ అనే హిందీ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ రూపొందింది. బ‌ప్పిల‌హ‌రి ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఈ చిత్రంలో ఓ ఫంక్షన్ నేపథ్యంలో వచ్చే పాటలో ఏకంగా 20 మంది నాటి అగ్రతారలు స్క్రీన్‌ షేర్ చేసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

శోభన్‌‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, శారద, విజయ నిర్మల, విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతి దర్శనమిచ్చారు. ఇప్పటివరకు మరే సినిమాలోనూ ఇంతమంది అగ్రనటులు కనిపించిన దాఖలాలు లేక‌పోగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇదొక రికార్డుగా చెబుతున్నారు.

బాలీవుడ్ లో వచ్చిన నసీబ్ అనే చిత్రంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కనబడడ‌డంతో నిర్మాత ఎన్టీరామారావు, నాగేశ్వరరావులను తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. కానీ వారు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న ఆ సినిమాలో నటించలేనని చెప్పడంతో వారి వారసులైన బాలకృష్ణ, నాగార్జునలను ఒప్పించి న‌టింప‌జేశారు.

త్రిమూర్తులు సినిమాలో ఒకే మాట ఒకే బాట అనే పాటను హీరో వెంకటేష్ పాడుతూ ఉండ‌గా , శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మురళీమోహన్, చంద్రమోహన్, వీరికి జోడీగా విజయనిర్మల, శారద, విజయశాంతి, జయమాలిని, రాధా, రాధిక లతో పాటుగా మిగతా దర్శక నిర్మాతలు కనిపిస్తారు.

Exit mobile version