Train Accident | రాజస్థాన్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్‌.. కొందరికి గాయాలు

  • Publish Date - March 18, 2024 / 04:27 AM IST

Train Accident : రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఇంజిన్‌, నాలుగు బోగీలు పట్టాలుతప్పాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అజ్మీర్‌లోని మదార్ రైల్వేస్టేషన్ వద్ద మధ్యరాత్రి 1.04 గంటలకు సబర్మతి-ఆగ్రా కాంట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

గూడ్స్ రైలును ఢీకొనడంతో సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు బోగీలు ఇంజన్‌తోసహా పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని, ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు.

నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని రైలులోని ప్రయాణికులు చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)తో పాటు అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ADRM) , సీనియర్ అధికారులతో సహా రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లు, ఇంజిన్‌లను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పట్టాలు తప్పిన రైలు ఢీకొనడంతో కొన్ని రైల్వే స్తంభాలు కూడా రైలుపై పడిపోయాయి. వాటిని గ్యాస్ కట్టర్ సహాయంతో కట్ చేస్తున్నారు. ప్రయాణికులకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, నాలుగు జనరల్ కోచ్‌లు పట్టాలు తప్పాయని నార్త్ వెస్ట్రన్ రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్వీట్ చేసింది.

‘ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. రైలు వెనుక భాగాన్ని అజ్మీర్‌కు తీసుకువెళుతున్నారు. అజ్మీర్ స్టేషన్‌లో అధికారులు హెల్ప్ డెస్క్‌ ఏర్పాటు చేశారు. అవసరమైన వారు ఈ హెల్ప్‌లైన్ నంబర్ 0145-2429642 లో సంప్రదించవచ్చు’ అని రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

Latest News