Rekha Jhunjhunwala | ఆ అనుభూతికి దూరమవుతానని భవంతినే కొనేసిన రేఖా ఝున్‌ఝున్‌వాలా..!

  • Publish Date - March 24, 2024 / 02:07 AM IST

Rekha Jhunjhunwala : రేఖా ఝున్‌ఝున్‌ వాలా..! పెట్టుబడుల మాంత్రికుడిగా పేరు గడించిన దివంగత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సతీమణి ఆమె. ఇటీవల ఆమె ముంబైలోని తన ఇంటి ముందున్న 50 ఏండ్ల నాటి భవంతిలో దాదాపు అన్ని ఫ్లాట్‌లను కొనుగోలు చేశారు. ఆ భవంతి పునర్నిర్మిస్తున్నారని ముందే గ్రహించి ఆ పని చేశారు. ఆ భవంతి పునర్నిర్మాణం ఇప్పుడప్పుడే జరగకుండా అడ్డుకోగలిగారు. మరి ఆమె ఎందుకిలా చేశారు..? ఆ భవంతి పునర్నిర్మాణం జరిగితే ఖా ఝున్‌ఝున్‌ వాలాకు ఏం నష్టం..? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

రేఖా ఝున్‌ఝున్‌ వాలాకు మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మలబార్ హిల్స్‌ దగ్గర రేర్‌ విల్లా రెసిడెన్స్‌ ఉంది. దక్షిణ ముంబైలోని ఈ రేర్‌ విల్లా రెసిడెన్స్‌కు, అరేబియా సముద్రానికి మధ్యలో వాకేశ్వర్‌ రోడ్డులో 50 ఏళ్లకు పైబడిన రాక్‌సైడ్‌ అపార్టుమెంట్స్‌ ఉన్నాయి. పాతబడిన ఈ రాక్‌సైడ్‌ అపార్టుమెంట్స్‌తోపాటు మరో ఆరు భవనాలను క్లస్టర్‌ పథకం కింద పునర్నిర్మించాలని ఇటీవల నిర్ణయించారు. ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం షాపూర్జీ పల్లోంజి సంస్థ ఓ ప్రతిపాదనను కూడా సమర్పించింది.

దాంతో రాక్‌సైడ్‌ అపార్టుమెంట్స్‌ పునర్నిర్మాణం జరిగితే ఎత్తు పెరుగుతుందని.. అప్పుడు తన విల్లాకు, సముద్రానికి నడుమ అడ్డుగా ఉంటుందని.. తన ఇంటి నుంచి సముద్రాన్ని చూసే అనుభూతిని కోల్పోతానని రేఖా ఝున్‌ఝున్‌ వాలా గ్రహించారు. అందుకే ఆ పాతబడ్డ రాక్‌సైడ్‌ అపార్టుమెంట్స్‌లోని ఫ్లాట్లను ఒక్కొక్కటిగా తన పేరిట, తన బంధుమిత్రుల పేరిట కొనుగోలు చేశారు. ఆవిధంగా 2023 నవంబర్‌ నుంచి వివిధ సంస్థల ద్వారా తొమ్మిది ఫ్లాట్లను రూ.118 కోట్లకు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్‌ దస్త్రాల ద్వారా తెలిసింది.

ఆ భవంతిలో మొత్తం 24 ఫ్లాట్లు ఉండగా.. ఇప్పటికే 19 ఫ్లాట్‌లు రేఖా ఝున్‌ఝున్‌వాలా కుటుంబీకుల చేతిలోనే ఉన్నట్లు మార్కెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అపార్టుమెంటులో దాదాపు అన్ని ఫ్లాట్‌లు రేఖ, ఆమె కుటుంబీకులు కొనుగోలు చేయడంతో ఇప్పుడు ఆ రాక్‌సైడ్‌ సీహెచ్‌ఎస్‌ అపార్టుమెంట్‌ను పునర్నిర్మాణం చేయాలంటే.. అందులో అధిక ఫ్లాట్లు కలిగి ఉన్న కొత్త యజమాని సమ్మతి అవసరం. రేఖా ఝున్‌ఝున్‌వాలా ఒప్పుకుంటేనే ఆ అపార్టుమెంట్‌ పునర్నిర్మాణం సాధ్యం. దాంతో షాపూర్జీ పల్లోంజీ సంస్థ కూడా క్లస్టర్‌ పునర్నిర్మాణ ప్రక్రియను వాయిదా వేసుకుంది.

Latest News