TS 10th Class Results 2023
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ స్కూల్లో ఈ ఫలితం.
- ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా ?
- పంతుళ్ళ పనితనానిని ఈ ఫలితం నిదర్శనమా అంటున్న తల్లిదండ్రులు.
విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కోటపల్లి మండలం మల్లంపేట ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షకు (TS 10th Class Results 2023) హాజరైన విద్యార్థులలో ఒకరంటే ఒకరే పాసుకావడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ వన్‌లో నిలిచి సంచలనం సృష్టిస్తే, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలోని సెకండరీ పాఠశాలలో వచ్చిన రిజల్ట్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
పదవ తరగతి పరీక్షలకు ముందే ప్రత్యేక తరగతులు అంటూ ప్రణాళికలంటూ విద్యార్థులు వెంటబడి చదివిస్తున్నామని చెబుతున్న ఉపాధ్యాయులు ఈ రిజల్ట్ విషయంలో వారి పనితనం ఏంటో బయటపడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పదో తరగతి పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆ పాఠశాలలో రిజల్ట్ రాకపోవడం చర్చ జరుగుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లోపం జరిగిందా లేక విద్యార్థులకు విద్యను అందించడంలో ఉపాద్యాయుల లోపం జరిగిందా అనే చర్చ స్థానికంగా కొనసాగుతుంది.
క్షేత్రస్థాయిలో విద్యార్థికి చదువు పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా విద్యా విధానం కొనసాగితే ఇలాంటి రిజల్ట్ కు తావుండేది కాదు. ప్రత్యేక శిక్షణ కేంద్రాలంటూ ప్రచారం ఆర్భాటం కాకుండా క్షేత్రస్థాయిలో విద్యార్థులే కేంద్రంగా పాఠశాల చదువులు కొనసాగితే ఫలితం ఇంత హీనస్థితిలో ఉండేది కాదని విద్య అభిమానులు భావిస్తున్నారు .
కోటపల్లి మండలంలోని మల్లంపల్లి పాఠశాలలో 2023లో పదో తరగతి పరీక్షలకు 10 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో ఒకరంటే ఒకరే పాస్ కావడం మిగతా 9 మంది ఫెయిల్ కావడంతో స్థానికంగా చర్చకు దారి చేసింది.
మల్లంపేట సెకండరీ పాఠశాల హెడ్ మాస్టర్ రత్నసత్య రెడ్డి ఈ విషయం పై వివరణ ఇస్తూ విద్యార్థులు స్కూలుకు రెగ్యులర్ గా రాకపోవడం మూలంగానే పాస్ పర్సంటేజీ తగ్గిందని పేర్కొన్నారు . అలాగే టెన్త్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ మాథ్స్ సిలబస్ ఇవ్వడం మూలంగా ఎక్కువమంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి కారణమైందని పేర్కొన్నారు.
ఇకముందు ఇలాంటి ఫలితాలు రాకుండా ఉన్నతాధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించి విద్యను బోధించే విధంగా చర్యలు చేపట్టాలని, అదే స్థాయిలో రిజల్ట్ వచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.