విధాత: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ఫలితాలను ఒక్కొక్కటి విడుదల చేస్తున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీ కోసం ఆరు ఉద్యోగ ప్రకటన కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టీకల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఎంవీఐ, లైబ్రేరియన్ జనరల్ పోస్టుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా (జీఆర్‌ఎల్) విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇచ్చింది. 2023 మే, జూన్, జులై నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించింది. వీటి జనరల్ ర్యాంకు జాబితాను సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు, ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు.