Site icon vidhaatha

TSPSC | బేరం బెడిసికొట్ట‌డంతో 100కు డ‌య‌ల్.. వెలుగులోకి టీపీబీవో ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ

TSPSC | తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్‌సీర్( TPBO ) ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ నెల 12వ తేదీన నిర్వ‌హించాల్సిన టీపీబీవో రాత‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు శ‌నివారం రాత్రి టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. టీపీబీవో ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయిన కార‌ణంగానే ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే తేదీలు ప్ర‌క‌టిస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది.

అయితే ప్ర‌శ్నాప‌త్రం లీకేజీకి సంబంధించి పోలీసుల ద‌ర్యాప్తులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. టీఎస్‌పీఎస్సీ సెక్ర‌ట‌రీ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడే ప్ర‌శ్నాప‌త్రాలను లీక్ చేసిన‌ట్లు తేలింది. ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయిని ఒత్తిడి కార‌ణంగానే సెక్ర‌ట‌రీ పీఏ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల‌ను లీక్ చేసిన‌ట్లు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. అయితే ప్ర‌శ్నాప‌త్రాల‌ను అభ్య‌ర్థుల‌కు విక్ర‌యించే క్ర‌మంలో బేరం బెడిసికొట్ట‌డంతోనే ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

త‌మ్ముడి కోసం క్వ‌శ్చ‌న్ పేప‌ర్ కావాల‌ని ఉపాధ్యాయిని ఒత్తిడి..

టీఎస్‌పీఎస్సీ సెక్ర‌ట‌రీ పీఏ ప్ర‌వీణ్‌కు హైద‌రాబాద్‌కు చెందిన ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయినితో కొన్నాళ్ల క్రితం ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అయితే ఆమె ప్ర‌వీణ్‌ను క‌లిసేందుకు త‌రుచూ టీఎస్‌పీఎస్సీ కార్యాల‌యానికి వ‌చ్చేది. స్పెష‌ల్ పోలీసుల ఆధీనంలో ఉండే టీఎస్‌పీఎస్సీ కార్యాల‌యంలోకి ఎవ‌ర్నీ అంత ఈజీగా అనుమ‌తించ‌రు. కానీ ఉపాధ్యాయినిని మాత్రం అనుమ‌తించాల‌ని ప్ర‌వీణ్ పోలీసుల‌కు చెప్పేవాడ‌ని తేలింది. ఇటీవ‌లే టీఎస్‌పీఎస్సీ ఆఫీసుకు వ‌చ్చిన ఉపాధ్యాయిని.. త‌న త‌మ్ముడికి ఈ నెల 12న టీపీబీవో ఎగ్జామ్ ఉంది.. ఆ ప్ర‌శ్నాప‌త్రాలు కావాల‌ని ప్ర‌వీణ్‌పై ఒత్తిడి తెచ్చింది.

బేరం బెడిసికొట్ట‌డంతో.. 100కు డ‌య‌ల్

ఇక ఉపాధ్యాయిని ఒత్తిడితో ప్ర‌వీణ్ టీపీబీవో క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చాడు. ఇద్ద‌రూ క‌లిసి ఆ ప్ర‌శ్నాప‌త్రాల‌ను ప‌రీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు విక్ర‌యించి, డ‌బ్బు సంపాదించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఒక స‌ర్పంచ్ కుమారుడితో ఉపాధ్యాయిని బేర‌సారాలు న‌డిపి.. న‌లుగురు అభ్య‌ర్థుల నుంచి రూ. 14 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. ఇందులో ప్ర‌వీణ్‌కు రూ. 10 ల‌క్ష‌లు ముట్టజెప్పింది. మ‌రికొంత మంది అభ్య‌ర్థుల‌కు ప్ర‌శ్నాప‌త్రం విక్ర‌యించే సంద‌ర్భంలో బేరం బెడిసికొట్టింది. దీంతో టీపీబీవో ప్ర‌శ్నాప‌త్రం లీకైంద‌ని ఓ యువ‌కుడు శ‌నివారం సాయంత్రం డ‌య‌ల్ 100కు కాల్ చేసి చెప్పాడు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వెంట‌నే టీఎస్‌పీఎస్సీ కార్యాల‌యానికి స‌మాచారం అందించారు. దీంతో టీపీబీవో ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వాట్సాప్ ద్వారా ప్ర‌శ్నాప‌త్రాలు బ‌య‌ట‌కు..

అయితే మొద‌ట క‌మిష‌న్ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంద‌ని అధికారులు భావించారు. కానీ ద‌ర్యాప్తులో అది నిజం కాద‌ని తేలింది. ప్ర‌శ్నాప‌త్రాలు ఉన్న కంప్యూట‌ర్ యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్ దొంగిలించిన ప్ర‌వీణ్‌.. ఎవ‌రికీ తెలియ‌కుండా క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ను ఫోటోలు తీసుకున్నాడు. అనంత‌రం వాట్సాప్ ద్వారా ఉపాధ్యాయినికి పంపించాడు. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 13 మందిని అరెస్టు చేశారు. ప్ర‌వీణ్ వ్య‌క్తిగ‌త ఫోన్, ల్యాప్‌టాప్‌ల‌ను సైబ‌ర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

Exit mobile version