విధాత: మావోయిస్టుల పేరుతో మిర్యాలగూడలో రైస్ మిలర్స్ అధ్యక్షుడు గౌరీ శ్రీనివాస్‌ను ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులు తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్, సుంచు మల్లేష్‌ను ట్రాప్ చేసి మిర్యాలగూడకు రప్పించి రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు.
సుదర్శన్ రెడ్డి, సుంచు మల్లేష్ నకిలీ మావోయిస్టుల పేరుతో మిర్యాలగూడ వ్యాపారిని బెదిరించారని, వీరు గతంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో సైతం ఇదే రీతిలో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడ్డారని డిఎస్పీ తెలిపారు.
జనశక్తి నక్సలైట్ గ్రూపులో పనిచేసిన సుదర్శన్ రెడ్డి జనజీవన స్రవంతిలో కలిశాక భద్రత కోసం అంటూ రివాల్వర్ అనుమతి పొందారని, దానితో బెదిరింపులు, వసూళ్లు చేయడం వంటి నేరాలు చేసిన క్రమంలో పట్టుబడి గతంలో 2017లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడన్నారు.
అనంతరం ఖరిదైన సెల్ ఫోన్లు దొంగతనాలు చేసి కుషాయిగూడలో పట్టుబడి మళ్లీ జైలుకెళ్లాడని జనవరిలో విడుదల అయ్యాక మళ్ళీ పాత నేర ప్రవృత్తిని అనుసరించాడని తెలిపారు.
ఈ క్రమంలోనే మిర్యాలగూడ రైస్ మిల్ వ్యాపారిని బెదిరించి వసూళ్లకు పాల్పడే క్రమంలో అతడిని, మల్లేష్‌ను కూడా ట్రాప్ చేసి పట్టుకున్నట్లుగా డిఎస్పి తెలిపారు. సుదర్శన్ రెడ్డి రివాల్వర్‌ను, ఇద్దరు నిందితుల సెల్ ఫోన్‌లను సీజ్ చేసినట్లుగా తెలిపారు.