విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ఇద్దరు సలహాదారులను నియమించింది. మొత్తం ఇప్పటికి ఎంతమంది అయ్యారో తెలీదు గానీ దాదాపు యాభై మందికి పైగానే సలహాదారులు ఉంటారని అంటున్నారు. ప్రభుత్వానికి కాకుండా వివిధ శాఖలకు కూడా వేర్వేరుగా సలహాదారులు వచ్చారు.
అసలు వీళ్ళు ఏమి సలహాలు ఇస్తారో.. జగన్ ఏమి సలహాలు తీసుకున్నారో.. తీసుకుంటారో తెలీదు కానీ నెలకో ముగ్గురునలుగురు చొప్పున వస్తూనే ఉన్నారు. ఆయా రంగాల్లో అత్యంత ప్రతిభ, అపార అనుభవం కలిగినవారిని సలహదారులుగా పెట్టుకున్నారంటే అర్థం ఉంది కానీ.. ఆయా రంగాల్లో కనీస ప్రవేశం, అనుభవం లేని వాళ్ళు కూడా ఇలా ప్రభుత్వం మీద ఎక్కి జీతభత్యాలు తీసుకోవడం చూస్తుంటే సలహాదారు అనే పదానికి అర్థం మరిపోయినట్లు అయింది.
నేడు తాజాగా వ్యవసాయ శాఖకు తిరుపాల్ రెడ్డి ఉద్యాన శాఖకు శివప్రసాద్ రెడ్డిలను సలహదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమధ్య పంచాయతీ రాజ్ శాఖకు సలహాదారునిగా పోతినేని నాగార్జున రెడ్డిని నియమించారు.
దేవాదాయ శాఖకు సలహాదారునిగా జ్వాలాపురం శ్రీకాంత్ ని నియమించగా హై కోర్టు ఆ నియామకం మీద స్టే ఇచ్చింది. ఆయా శాఖలకు మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డైరెక్టర్లు, కమిషనర్లు ఉండగా మళ్ళీ ఈ సలహాదారులు ఎందుకు, వీరి ఉద్యోగ బాధ్యతలు ఏమిటో, వీళ్ళు ఎవరికి సలహాలు ఇస్తారో అర్థం కాని పరిస్థితి.