Bhatti Vikramarka |
- తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువుల భర్తీ
- పీపుల్స్ మార్చ్ లో భట్టి
విధాత : తెలంగాణాలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు 5లక్షలు, వంద రోజులు పనికి వెళ్లే వారికి, నిరుపేద కూలీలకు ఏడాది 12 వేలు ఇస్తామని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హామీ ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండాకు చేరుకున్న పాదయాత్రలో భట్టి మాట్లాడుతూ ఇంట్లో ఉండే ఇద్దరు ముసలవ్వా, తాతలకు వృద్ధాప్య ఫించన్ ఇస్తామని, ప్రభుత్వం వచ్చిన తొలిఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు 4 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందన్నారు.
మున్యానాయక్ తాండా నుంచి పాదయాత్రగా వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్సారెస్పీ నీటి కాలువను భట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన కాకాతీయ కాలువ ఎక్స్ టెన్షన్ ఫేజ్ 2 కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
అంతకుముందు పాదయాత్ర మున్యానాయక్ తండాలో అడుగు పెట్టిన సందర్భంగా భట్టి విక్రమార్కకు గ్రామం మొత్తం ఎదురేగివెళ్లి స్వాగతం పలికారు. ఆటపాటలతో కోలాటలతో పాదయాత్రలో సాగారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన బాణోత్ సుజాత, బాణోత్ దుర్గాబాయి. బాణెత్ దేవిక, బాణోత్ ప్రమీలలు రోడ్డు పక్కనే రొట్టెలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారి వద్దకు రాగానే రోడ్డుపక్కనే రెండు మంచాలు వేసి ఆయనకు వేడివేడిగా రొట్టెలు చేసిపెట్టారు. ఈ సందర్భంగా వారితో పాటు అక్కడున్న గ్రామస్తులంతా మూకుమ్మడిగా భట్టి విక్రమార్కతో గ్రామ సమస్యలు చెప్పారు. చదువుకున్న బిడ్డలకు కొలువులు లేవు, ఇండ్లు లేవు, గ్యాస్ ధర కొనేట్లుగాలేదు, భూములు లేవు, బతికేందుకు ఉపాధి అవకాశాలు లేవంటూ చెప్పారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని,హామీల వివరాలను వెల్లడించారు. అంతకుముందు రాత్రి పాదయాత్ర కు సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి సంఘీభావం తెలిపారు.
నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి, నేడు భట్టి విక్రమార్కలు సాగించిన పాదయాత్రలు ప్రజల కష్టాలను తెలుసుకొని పరిష్కారం దిశగా అవగాహనకు, ప్రజల కోసం ప్రణాళికలు రూపొందించేందుకు పార్టీ నాయత్వానికి ఉపకరించాయన్నారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, డిసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.