Kamareddy | ఇది హృదయ విదారక ఘటన.. కోడలు మరణవార్త విన్న అత్త ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అత్త కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రుద్రారం గ్రామానికి చెందిన పాపిగల్ల కమలమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు పద్మారావు ఉన్నారు. పద్మారావు తన భార్య రుక్మిణితో కలిసి ఏడుపాయల ఆలయానికి వెళ్లాడు. అయితే శనివారం రాత్రి ఆలయం వద్దే నిద్రించారు. ఆదివారం ఉదయం ఆమె ఎంతసేపటికి కూడా మేల్కొనలేదు. దీంతో అప్రమత్తమైన పద్మారావు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రుక్మిణి మరణించినట్లు పద్మారావు తన తల్లి కమలమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కమలమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్తాకోడలు గంటల వ్యవధిలో మృతి చెందడంతో రుద్రారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.