Site icon vidhaatha

BUDGET: మొబైల్స్ మరింత చౌక

విధాత: టీవీ, కెమెరాలు, మొబైల్ ఫోన్లు ఇకపై తక్కువ ధరకే లభించనున్నాయి. ఈ మూడింటి విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గనున్నాయి. పొగ రాయుళ్లకు మాత్రం బడ్జెట్ చేదు కబురు చెప్పింది. సిగరెట్లపై కస్టమ్స్​ డ్యూటీని 16 శాతం పెంచింది.

ఈ క్రమంలో సిగరెట్ రేట్లు మరింత పెరగనున్నాయి. గోల్డ్, ప్లాటినం బార్స్ నుంచి చేసే ఆభరణాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

మహిళలకు కొత్త స్కీమ్‌.. ‘సమ్మాన్‌ బచత్‌ పత్ర’

మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ పొదుపు సర్టిఫికెట్‌ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో డిపాజిట్‌పై 7.5% స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా ₹2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.

సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్‌ పరిమితి ₹15లక్షల నుంచి ₹30 లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు. మధ్యతరగతి ప్రజలు టూరిస్ట్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు దేఖో అప్నా దేశ్‌ పేరిట పర్యాటక పథకం తీసుకొస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాలనుకునే దేశీయ పర్యాటకులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తారు.

PMAYకి రూ.79 వేల కోట్లు.. రైల్వేకు 2.4లక్షల కోట్లు

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం ₹13.7లక్షల కోట్లు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రైల్వేకు ₹2.4లక్షల కోట్లు ప్రతిపాదించారు. 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్ల నిధులు కేటాయించామని పేర్కొన్నారు.

పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లను ప్రత్యేక నిధుల కింద అందిస్తామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నాం అని వెల్లడించారు.

వ్యవసాయ రుణాలకు ₹20లక్షల కోట్లు: నిర్మల

శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఈ బడ్జెట్ ఏడు ప్రాధాన్య అంశాలుగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా సమ్మిళిత వృద్ధిని పేర్కొన్నారు. ఆత్మనిర్భర క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ ప్రకటించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 20 లక్షల కోట్లుగా పెడుతున్నట్టు ప్రకటించారు.

పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా ప్రత్యేక పథకాన్ని రూ.6 వేల కోట్లతో తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి ఇకపై మరింత ప్రాధాన్యం పెంచుతామని ప్రకటించారు. అగ్రి స్టార్టప్‌ లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామన్నారు. 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Exit mobile version