Site icon vidhaatha

కార్మికుల ర‌క్ష‌కుడు మున్నా ఖురేషీ


విధాత‌: ఉత్త‌రాఖండ్‌లోని ఉత్త‌ర‌కాశీలో ఉన్న‌ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల‌ను కాపాడేందుకు ఆర్మీ క‌ద‌లి వ‌చ్చింది. మైనింగ్‌లోనే అత్యంత సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించారు. అంత‌ర్జాతీయ నిపుణుల‌ను ర‌ప్పించారు. కానీ, వారిని బ‌య‌ట‌కు తీసుకురావ‌డంతో ఎవ‌రి వ‌ల్లా కాలేదు. 16 రోజులపాటు చేసిన‌ అన్నీ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌య్యారు.


అప్ప‌డు ఎంట‌ర‌య్యాడు మున్నా ఖురేషీ. త‌న బృందంతో చివరి 12 మీటర్ల శిథిలాల‌ను ఎలుక‌లు త‌వ్విన‌ట్టు త‌వ్వి కార్మికుల‌కు చిక్కుకున్న ప్రాంతానికి చేరుకున్నాడు. అక్క‌డ చిక్కుకున్న కార్మికులంద‌రినీ క్షేమంగా బ‌య‌ట‌కు పంపించాడు. 17 రోజుల భారీ రెస్క్యూ ఆపరేషన్‌ బుధవారం విజయవంతంగా ముగించి ప్రభుత్వం యంత్రాంగం చేత శెభాష్ అనిపించుకున్నాడు. స్వ‌యంగా ప్ర‌ధాని మోదీనే మున్నాను మెచ్చుకున్నారు.


అస‌లు మున్నా ఎవ‌రు? ఏం చేస్తుంటాడు?


29 ఏండ్ల మున్నా ఖురేషి ర్యాట్-హోల్ మైనింగ్‌లో నేర్ప‌రి. ఢిల్లీ కంపెనీలో పనిచేస్తున్నాడు. మురుగునీరు, నీటి మార్గాలను క్లియర్ చేసే ట్రెంచ్‌లెస్ ఇంజినీరింగ్ సేవల సంస్థ అది. ఉత్త‌ర‌కాశిలో ట‌న్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికుల‌ను చేరుకోవ‌డానికి అడ్డంగా ఉన్న చివరి 12 మీటర్ల శిథిలాలను తొలగించడానికి సోమవారం ఉత్తరాఖండ్‌కు తీసుకొచ్చిన ర్యాట్-హోల్ మైనింగ్ నిపుణుల్లో ఖురేషీ ఒకడు.


ట‌న్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల‌కు కాపాడేందుకు అమెరికా అగ‌ర్ యంత్రం చివ‌రి ద‌శ‌కు వెళ్లిన త‌ర్వాత మోరాయించింది. దాని బ్లేడ్లు విరిగిపోయాయి. కార్మికుల‌ను చేర‌డానికి 12 మీట‌ర్ల దూరంలో ప‌నులు నిలిచిపోయాయి. అప్పుడు వేరే ప్ర‌త్యామ్నాయ మార్గాలు లేక‌పోవ‌డంతో మ్యానువ‌ల్‌గా ప్ర‌వేశించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అప్పుడు ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు రంగంలోకి దిగి చివ‌రి అంకాన్ని విజ‌య‌వంతంగా ఫినిష్ చేశారు. గ‌నుల్లో బొగ్గును త‌వ్వేందుకు ఎలుక‌ల త‌ర‌హాలో సొరంగాలు చేసే ప‌ద్ధ‌తిని ర్యాట్-హోల్ మైనింగ్ అంటారు. అయితే, ఈ ప‌ద్ద‌తి చాలా ప్ర‌మాద‌క‌ర‌మైనది కావ‌డంతో 2014లోనే నిషేధించారు. నిషేధించిన ఆ ప‌ద్ధ‌తే 41 మంది కార్మికుల ప్రాణాల‌ను కాపాడ‌టానికి ఉప‌యోగ‌ప‌డింది.


మంగళవారం సాయంత్రం చివరి శిథిలాలను తొలగించి చిక్కుకున్న 41 మంది కార్మికులను చూశానని మున్నా ఖురేషీ చెప్పారు. “వారు నన్ను కౌగిలించుకున్నారు, చప్పట్లతో ఉత్సాహపరిచారు. నాకు చాలా కృతజ్ఞతలు తెలిపారు” అని మున్నా ఖురేషి చెప్పారు. మోను కుమార్, వకీల్ ఖాన్, ఫిరోజ్, పర్సాది లోధి, విపిన్ రజౌత్ ఇతర ర్యాట్-హోల్ మైనింగ్ కార్మికులు కష్టతరమైన ఆపరేషన్ తర్వాత ట‌న్నెల్‌లో చిక్కుకున్న వ్యక్తులను చేరుకున్నారు. 17 రోజులుగా ట‌న్నెలోనే నిరీక్షిస్తున్న కార్మికులు వీరిని చూసి ఒక్క‌సారిగా భావోద్వేగానికి గుర‌య్యారు. ఆనందంతో గంతులేశారు. ప‌దేప‌దే కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Exit mobile version