Site icon vidhaatha

Vadagandla vana: ములుగు జిల్లాలో వడగండ్ల వాన..

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు జరిగి పూర్తిగా చల్లబడింది. ములుగు జిల్లాలో మాత్రం వడగండ్ల వాన కురిసింది. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులు, వర్షంతో పాటు భారీగా వడగండ్లు పడ్డాయి. గోవిందరావుపేట పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. గత మూడు రోజుల నుంచి వాతావరణ మార్పులు ఉంటాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు.

ఆకస్మికంగా మారిన వాతావరణం

ఈ మేరకు గురువారం ఉదయం ఎండలు మండిపోయినప్పటికీ తదుపరి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మధ్యాహ్నానికి ఉక్క పోతనుండి చల్లని గాలులు వీచాయి. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని మంచు పరిసరాలను తలపించే విధంగా రోడ్లు, భవనాలు, పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. దీంతో పరిసరాలు ఒక్కసారిగా వడగండ్లతో తెలుపు రంగు సంతరించుకున్నాయి. కురిసిన వడగండ్లతో ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే జనం భయపడ్డారు. నల్లటి డాంబర్ రోడ్డుపై మంచు ముక్కలు ఆరబోసినట్లు వడగండ్లు చూపర్లకు కనువిందు చేశాయి. చల్లని వడగండ్ల నుంచి వర్షం నీరు ఎర్రని వరదగా పారింది.

కల్లాల్లో తడిసిన మిర్చి

ములుగు జిల్లా గోవిందరావుపేట, పస్రా, వెంకటాపూర్, చల్వాయి పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వడగండ్లతో మిర్చి పంట దెబ్బతిన్నది. కళ్ళాల్లో ఉన్న మిర్చి తడిసిపోయింది. మంచి కాత దశకు వచ్చిన మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version