నేను మచ్చ లేని 24 క్యారెట్ల మేలిమి బంగారాన్ని: వంశీచంద్ రెడ్డి

ప్రజా శ్రేయస్సు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని... ప్రజల ఆశీస్సులతో మచ్చలేని నేతగా ఎదిగానని.. తన రాజకీయ జీవితం 24 క్యారెట్ల మేలిమి బంగారం లాంటిదని చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు

  • Publish Date - March 29, 2024 / 12:14 PM IST

– ప్రజా హితం.. నా అభిమతం

– ప్రజల శ్రేయస్సు కోసమే రాజకీయాల్లోకి

– లిక్కర్, భూదంధాలు, అక్రమ సంపాదన లేని నేతను

– స్వచ్ఛమైన నేతనైనా నన్ను పాలమూరు ప్రజలు పార్లమెంట్ కు పంపండి

– బీజేపీ ని గద్దె దించేందుకు సిపిఐ నేతలు కదిలిరావాలి

– పాలమూరు పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ప్రజా శ్రేయస్సు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల ఆశీస్సులతో మచ్చలేని నేతగా ఎదిగానని, తన రాజకీయ జీవితం 24 క్యారెట్ల మేలిమి బంగారం లాంటిదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన రాజకీయ జీవితం ప్రజలతో మమేకమై ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో పాలమూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచి రూపురేఖలు మార్చాలన్నదే నా అభిమతమన్నారు. తనకు లిక్కర్ దందాలు లేవని, ఎప్పుడూ కూడా కాంట్రాక్టులు, క్లషర్ యూనిట్లు, సారా, మద్యం, మైనింగ్ వ్యాపారాలు చేయలేదని, బెదిరింపులు, కబ్జాలు అంటేనే తెలియవని ఆయన తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే పని చేయడం తనకు తెలుసన్నారు.

పాలమూరు లోక్ సభ మ్యానిఫెస్టోను ప్రజల సూచనలు, సలహాలతో ప్రధాన ఎజెండాగా పొందుపరచి కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి చేర వేస్తామని, అందులో ఉన్న ‘క్యూ ఆర్’ కోడ్ ను స్కాన్ చేస్తే వచ్చిన డాక్యుమెంట్‌లో ఎవరికి వారు సూచనలు, సలహాలు తెలుపవచ్చని, వాయిస్ రికార్డ్ చేసి కూడా పంపవచ్చని వంశీ వెల్లడించారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ కోసం కాదని ప్రజా సమస్యల పరిష్కార వేదికని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించినట్లే గెలిచిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో ను వచ్చే నెల ఆరవ తేదీన హైదరాబాద్ లోని తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటిస్తామని వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం స్థానిక శ్రీకృష్ణ ఫంక్షన్ హాలులో జరిగిన సీపీఐపార్లమెంటు మండల కార్యదర్శుల ముఖ్య సమావేశం లో వంశీ మాట్లాడారు. బీజేపీ దుష్ట కౌగిలి నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సీపీఐ, కాంగ్రెస్ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల సహకారం తో కనిపించే శత్రువు తో పోరాడి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నామని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో కనిపించని శత్రువు తో యుద్ధం చేయబోతున్నామన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ గెలుపు తోనే మహబూబ్ నగర్ అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంచార్జీగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా అత్యంత కీలకమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ కలయికతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినామని, అలాగే ‌మళ్లీ ఇప్పుడు దేశంలో సైతం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ విముక్తి దేశంగా భార‌త్‌ను మార్చాలంటే మనం కలిసి కట్టుగా పనిచేయాలని ప్రజా సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారానికి అనుక్షణం కృషి చేయాలన్నారు. ఈ సమావేశాల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్ నర్సింహా, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, రాఘవేందర్, ఉమ్మడి జిల్లా సీపీఐ కార్యదర్శులు కొండన్న, విజయరాములు, బాలకిషన్, పర్వతాలు, పల్లె నర్సింహులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుళ్ల కొత్త్వాల్, నేతలు వినోద్, వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Latest News