Site icon vidhaatha

Vande Bharat Express | శ్రీవారి భక్తులకు శుభవార్త..! సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య ఏప్రిల్‌లో పట్టాలెక్కనున్న వందే భారత్‌ రైలు..!

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా మరో రూట్‌లో వందేభారత్‌ పట్టాలెక్కనున్నది. సికింద్రాబాద్‌ – తిరుపతి మార్గంలో రైలు అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు నిర్వహణ ఏర్పాట్లు చేయాలని రైల్వే అధికారులు ఆయా డివిజన్ల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వారం రోజుల్లోనే రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్‌-కర్నూలు, వికారాబాద్‌-తాండూరు-రాయచూరు మార్గాల్లో రైలు ప్రయాణిస్తున్నాయి.

అయితే, కొత్తగా ప్రవేశపెట్టబోతున్న వందే భారత్‌ రైలు సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే రైలు స్టాప్స్‌, చార్జీలు, ప్రయాణ సమయంపై స్పష్టత రావాల్సి ఉంది.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 8 నుంచి పట్టాలెక్కనున్నట్లు సమాచారం లభిస్తుండగా.. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుమలకు నారాయణాద్రి, పద్మావతి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌తో పాటు కాచిగూడ నుంచి వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇంకా పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఆయా రైళ్లలో దాదాపు 10-12 గంటలు ప్రయాణానికి సమయం పడుతుంది. ఆయా రైళ్లకు డిమాండ్‌ భారీగా ఉండడంతో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందేభారత్‌ తొలి రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించడంతో రైల్వేశాఖ సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు నిర్ణయించింది.

Exit mobile version