Vande Bharat Metro |
ముంబయి లైఫ్‌లైన్‌గా లోకల్ రైళ్లను భావిస్తుంటారు. ఆర్థిక రాజధానిలో లోకల్ రైళ్లు రవాణాకు అత్యంత కీలకమైంది. అయితే, ముంబైకర్ల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు.. మహానగరంలో 238 ఏసీ వందే మెట్రో రైళ్లను తీసుకువచ్చేందుకు ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్ భావిస్తున్నది.
లోకల్ రైలు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఎంఆర్‌వీసీ 2856 కోచ్‌ల కొనుగోలు కోసం అంతర్జాతీయ టెండర్‌ను సైతం జారీ చేసింది. అయితే, ఈ వందే మెట్రో ఏసీ లోకల్ రైళ్లు కోసం ముంబయి వాసులు మరికొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు. ఎంఆర్‌వీసీ ఈ టెండర్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఇంతకు ముందు జారీ చేసిన 238 వందే మెట్రో టెండర్ ఇప్పుడు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా వేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపింది.
ముంబయి అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (MUTP) మూడో దశ కింద 12 కోచ్‌లతో 238 రైళ్లకు 2,856 కోచ్‌ల కొనుగోలు కోసం ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్ టెండర్‌ను ఆహ్వానించింది. ఎంయూటీపీ మూడో దశ ప్రాజెక్టు విలువ రూ.10,947 కోట్లు.
టెండర్ టెండర్ డాక్యుమెంట్ ప్రకారం.. విజయవంతమైన బిడ్డర్ వందే మెట్రో రేక్‌ల సేకరణ, జీవితకాల నిర్వహణను అలాగే వందే మెట్రో కోసం కొత్త మెయింటెనెన్స్ డిపోలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న నిర్వహణ సౌకర్యాలను నవీకరణవంటి చేపట్టాల్సి ఉంటుంది. అయితే ముంబయి సబర్బన్ రైల్వే నెట్ వర్క్ కోసం రైల్వేబోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్ టెండర్‌ను విడుదల చేసింది.
టెండర్ ప్రకారం.. ఆయా రైళ్లను వంగావ్ (పాల్ఘర్ జిల్లా), భివ్‌పురి (రాయ్‌గఢ్ జిల్లా)లో కొత్త కార్ షెడ్‌ల ఏర్పాటుతో పాటు ఎయిర్ కండిషన్డ్ వందే మెట్రో రేక్‌లను ఏడేళ్లలోపు సరఫరా చేయాల్సి ఉంటుంది. వందే మెట్రో రైలు నిర్మాణం కోసం రెండేళ్ల సమయం ఇవ్వగా.. రాబోయే ఐదేళ్లలో ప్రతి ఏటా సగటున 50 రైళ్లను సరఫరా చేయాల్స ఉంటుంది.
అలాగే బిడ్డర్ 35 సంవత్సరాల పాటు రైలు, మెయింటనెన్స్ డిపో నిర్వహణను చూసుకోవాల్సి ఉంటుంది. వందే మెట్రో ఫీచర్ల గురించి మరో ముంబయి రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. వందే మెట్రోలో ఆటోమేటిక్ డోర్లు, సింగిల్ క్లాస్ మోడ్రన్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నాన్-ఏసీ లోకల్ లాగా ఫస్ట్ క్లాస్ లేదంటే.. సెకండ్ క్లాస్ కోచ్ ఏర్పాటు ఉండదని వివరించారు.