Vande Bharat Sleeper | వందే భారత్‌ స్లీపర్‌ రైలు వచ్చేస్తున్నది..! అదిరిపోయేలా ఇంటీరియర్‌..!

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి

  • Publish Date - March 11, 2024 / 05:30 AM IST

Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు ప్రపంచస్థాయి సౌకర్యాలను వందే భారత్‌ రైళ్లలో తీసుకువచ్చింది. ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లకు మంచి డిమాండ్‌ ఉన్నది. ప్రస్తుతం 40కిపైగా రూట్లలో నడుస్తుండగా.. త్వరలో మరో 10 మార్గాల్లోనూ కొత్తగా పట్టాలెక్కబోతున్నది.

ప్రస్తుతం ఈ రైళ్లలో కేవలం చైర్‌కార్‌ మాత్రమే అందుబాటులో ఉన్నది. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే, ఈ క్రమంలో భారతీయ రైల్వేశాఖ వందే భారత్‌ వెర్షన్‌ స్లీపర్‌ రైళ్లను తీసుకురాబోతున్నది. త్వరలోనే ఈ రైళ్లను పట్టాలెక్కనున్నాయి. ఇటీవల వందే భారత్‌ స్లీపర్‌ ట్రాన్సిట్‌ కార్‌ బాడీ స్ట్రక్చర్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆవిష్కరించారు. ప్రస్తుతం వందే భారత్‌ స్లీపర్‌ రైలును బీఈఎంఎల్‌ నిర్మిస్తున్నది.

వందే భారత్‌ స్లీపర్‌ ప్రోటోటైప్‌ను బెంగళూరులో బీఈఎంఎల్‌ ఉత్పత్తి చేస్తుందని గతేడాది రైల్వేశాఖ మంత్రి తెలిపారు. స్లీపర్‌ రైలు పూర్తిగా ఆటోమేటెడ్‌. ప్రస్తుతం వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే మెరుగైన సౌకర్యాలు ఇందులో ఉండనున్నాయి. భారతీయ రైల్వేలలో రాత్రిపూట వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండనున్నది. ప్రస్తుతం పది వందే భారత్‌ రైలు స్పీపర్‌ సెట్‌లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ ఏడాది ప్రారంభంలో తెలిపారు.


 


బీఎంఈఎల్‌ తయారు చేయనున్న పది సెట్లతో పాటు ఇతర వందే భారత్‌ స్లీపర్‌ ప్రాజెక్టు పనులు సైతం జరుగుతున్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. మొదటి ప్రోటోటైప్ వందే భారత్ స్లీపర్ రైలు సెట్‌లో 11 ఏసీ 3 టైర్ కోచ్‌లు, 4 ఏసీ 2 టైర్ కోచ్‌లు, ఒకటి ఏసీ ఫస్ట్ కోచ్ ఉంటాయి. ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన కుషనింగ్‌తో కూడిన సౌకర్యవంతమైన బెర్త్‌లు, సాధారణ ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. రైలులో పై బెర్త్‌ను సులభంగా ఎక్కేందుకు మెరుగైన డిజైన్‌తో కూడిన మెట్లు ఉన్నాయి. మెరుగైన అనుభూతి కోసం లోపలి భాగంలో క్రీమ్, పసుపు, వుడ్‌ రంగులను ఉపయోగించారు.

ప్రస్తుతం రైలు నిర్మాణం పూర్తిగా.. లోపల ఫర్నిషింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలును ఐదారు నెలల వరకు పరీక్షించి.. ఆ తర్వాత ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. స్లీపర్​ కోచ్​ సైతం గతంలో ఉన్న చైర్​ కార్​ టెక్నాలజీతోనే నడుస్తుందని చెప్పారు. ప్రయాణ సమయంలో ఎలాంటి కుదుపులు, శబ్ధాలు రాకుండా.. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

Latest News