- వేములవాడ ఆలయ అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదు..
విధాత: వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏటా వంద కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మాట ఇచ్చి తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మూర్ఖపు పాలన అంతం కావాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు. వేములవాడకు వచ్చిన లక్షలాది మంది భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. మంచినీళ్లు లేక పసిపిల్లలు ఏడుస్తున్నారు. ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. వేములవాడకు నయా పైసా ఇవ్వకుండా ఇక్కడి పైసలు తీసుకుపోయి బయట ఖర్చు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కావాలనే వేములవాడ ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి వేడుకుంటున్నాను. వేములవాడతో పాటు కొండగట్టు ధర్మపురి ఆలయాల అభివృద్ధి కోసం కూడా ప్రతిపాదనలు పంపాలని అడిగినా పట్టించుకోవడం లేదని అన్నారు.
శివుడు అన్ని గమనిస్తున్నాడు. పేదల కోసం.. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం సీఎం 10 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. నీ బిడ్డ కూడా ఏం జరగాలో అదే జరుగుతుందదని కేసీఆర్ ను ఉద్దేశించి బండి సంజయ్ అన్నారు.