Site icon vidhaatha

హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ తనిఖీలు


విధాత‌: హెచ్‌ఎండీఏ కార్యాల‌యంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ లక్ష్యంగా ఈ సోదాలు కొన‌సాగిన‌ట్లు తెలిసింది. స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ ఎండీఏ కార్యాలయం 7వ అంత‌స్థులో సోదాలు చేశారు. వివిధ జోన్లకు చెందిన ప్లానింగ్ డిపార్ట్ మెంట్‌ ఫైళ్లను ప్రత్యేక క్యాబిన్‌కు తెప్పించుకొని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. సంబంధిత అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్న‌ట్లు స‌మాచారం.


విజిలెన్స్ అధికారులు అరెస్ట్ వారెంట్‌తో వెళ్లి సోదాలు చేప‌ట్టారు. హెచ్ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు, గతంలో అనుమతించిన ఫైల్స్‌పై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. గత ప్రభుత్వంలో హెచ్‌ఎండీఏ ఇచ్చిన అనుమతులపై విచారణ చేస్తున్న‌ట్లు తెలిసింది. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఇచ్చిన అనుమతులపై ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా గత 9 ఏళ్లలో ఇచ్చిన అనుమతులను విజిలెన్స్ అధికారులు పరిశీలించిన‌ట్లు తెలిసింది. 50 మందితో కూడిన స్పెషల్ విజిలెన్స్ బృందం సోదాలు నిర్వహిస్తు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది.


గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఫైళ్ల వివరాలు అడిగి మరి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్‌ శివ బాలకృష్ణను 270కోట్ల అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. అతని అక్రమాలతో పలువురు ఐఏఎస్‌లకు కూడా సంబంధాలున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. కాగా గురువారం జీహెచ్ ఎంసి, శుక్ర‌వారం డిస్ట్రిక్ట్‌ టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు జరిపే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం.


సీఎం ఆదేశాలతోనే..


విజిలెన్స్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల‌తోనే హెచ్‌ఎండీఏ పరిధిలో భూముల వివరాలు, లేఅ వుట్లు, భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌పై వివ‌రాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం హెచ్‌ఎండీఏపై పుర‌పాల‌క శాఖ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గానే మరోవైపు విజిలెన్స్ అధికారులు హెచ్‌ఎండీఏలో సోదాలు కొనసాగించడం గమనార్హం. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి హెచ్‌ఎండీఏ సహా పురపాలక శాఖల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.


గత బీఆరెస్ ప్రభుత్వం ఉప్పల్ భగాయత్‌, మేడిపల్లి, మోకిల, తుర్కయాంజాల్‌, కోకాపేట, బుద్వేల్‌లలో, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పలుచోట్ల భూముల వేలం నిర్వహించింది. తద్వారా వచ్చిన వేలకోట్ల ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేశారన్న వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి రాబడుతున్నారు. అలాగే ఆయా జిల్లాల పరిధిలో హెచ్‌ఎండీఏ భూములు కబ్జాలకు గురయ్యాయి. అక్రమ అనుమతులతో అన్యాక్రాంతమయ్యాయి.


నాటి బీఆరెస్ ప్ర‌భుత్వం గ‌త ప‌దేళ్ల కాలంలో హెచ్‌ఎండీఏ పరిధిలో వేలకోట్ల విలువైన భూములలో కొన్ని భూములను వేలం వేయగా, మరికొన్ని భూములను వివిధ సంస్థలకు, వ్యక్తులకు కారు చౌక‌గా కట్టబెట్టింది. వాటిన్నింటి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏలో టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు, న‌లుగురు ప్లానింగ్ అధికారుల సెక్ష‌న్లు, నాలుగు జోన్లు కేంద్రంగా ఈ సోదాలు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.


వీటితో పాటు ఇంజినీరింగ్ విభాగంలో అనేక ప్రాజెక్ట్‌లు చేప‌ట్టారు. వాటిల్లో జ‌రిగిన అక్ర‌మాలపై కూడా దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు తెలిసింది. దీంతో పాటు ఎస్టేట్ విభాగంతో పాటు ఔట‌ర్ రింగ్ రోడ్ విభాగంపై కూడా విజిలెన్స్ కేంద్రీక‌రించింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి ఔట‌ర్ రింగ్ రోడ్ టోల్ టెండ‌ర్ల అక్ర‌మాలపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో హెచ్ ఎండీఏలో జ‌రిగిన అక్ర‌మాల‌లో గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఉన్న లింక్‌ల‌పై రేవంత్ రెడ్డి స‌ర్కారు ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

Exit mobile version