Site icon vidhaatha

Suryapeta: గ్రామాల అభివృద్ధికి CM KCR పెద్దపీట: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం మక్తా కొత్తగూడెం గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయ‌తీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్న మహాత్ముడి కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం రాజీ లేకుండా నిధులు కేటాయిస్తునట్టు తెలిపారు. గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో గతంతో 8,670 గ్రామ పంచాయతీలు ఉండేవని, పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ వాటిని 12,751కి మార్చారని తెలిపారు. 2,800 తండాలను కూడా జీపీలుగా తీర్చిదిద్దారని అన్నారు.

దేశంలో ఉత్తమ పంచాయతీలుగా మన రాష్ట్రం నుంచి ఎక్కువ పంచాయతీలు ఎన్నికయ్యాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్ని నిధులైన వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంత మంచి సదావకాశాన్ని ప్రతి గ్రామ ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. 2014కు ముందు కక్ష్యలు, పార్టీల కొట్లాటల‌తో ఉన్న గ్రామాలలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు గడుపుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో సమస్యలపై సర్పంచులు దృష్టి సారించాలని సూచించారు.

కొత్తగా ఏర్పడ్డ గ్రామపంచాయతీలతో పాటు, శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో పక్కా భవనాలను దశల వారీగా మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సర్పంచులకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. గ్రామాలలో సంక్షేమ పథకం లబ్ధిపొందని గడపలేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎంపిపి చంద్రారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారయణ రెడ్డి, మండల అధ్యక్షులు తూడి నర్సింహ రావ్, ప్రధాన కార్యదర్శి బత్తుల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.

Exit mobile version