Site icon vidhaatha

లక్ష మందితో ‘ఉత్తరాంధ్ర జేఏసీ’ విశాఖ గర్జన!

పవన్ టూర్ కూడా ఖరారు

విధాత: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒక్కో జిల్లాను దాటుకుంటూ అమరావతి రైతుల పాదయాత్ర ముందుకు సాగుతున్న తరుణంలో విశాఖను పాలనా రాజధానిగా ఉంచాలని, విజయవాడ కర్నూలుల్లో కూడా శాసన, న్యాయ రాజధానులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో 15న లక్షమందితో బీచ్ రోడ్డులో గర్జన పేరిట ర్యాలీ.. సమావేశం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

తాము భూములు త్యాగం చేసాం కాబట్టి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని అక్కడి రైతులు, టీడీపీ అనుకూల వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అభివృద్ధి అంతా ఆ విజయవాడ చుట్టూ ఉంటే సరి పోతుందా ? మిగతా జిల్లాల గతేమవ్వాలి.. వాళ్లకు అభివృద్ధి వద్దా.. ఆల్రెడీ అన్ని సౌకర్యాలున్న విశాఖను వదిలి ఆ పల్లెటూళ్ళో రాజధాని ఏమిటి.. అన్ని వేల కోట్లు అక్కడ గుమ్మరించడం ఏమిటి.. మూడు రాజధానులు ఉంచాలని ఉత్తరాంధ్ర జనాలు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతుతో ఏర్పడిన జేఏసీ ఇప్పుడు లక్షమందితో గర్జన సభను ఏర్పాటు చేస్తోంది. అమరావతి రైతులు.. ర్యాలీల పేరుతో ఉత్తరాంధ్రలో అడుగుపెడితే మర్యాదగా ఉండదని, ఈప్రాంత ప్రజలు ఊరుకోరని ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్, ధర్మాన ప్రసాదరావు, ఇంకా స్పీకర్ తమ్మినేని సీతారాం స్ట్రాంగ్ గా హెచ్చరించారు.

విశాఖపట్నం రాజధాని అయ్యేందుకు తాను రాజీనామాకు సిద్ధమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేయగా ఇప్పటికే చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా కూడా చేసేశారు. మొత్తానికి అధికార పార్టీ నుంచి విశాఖకు మంచి మద్దతు దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే తమ వాయిస్ గట్టిగా వినిపించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు,మంత్రులు కూడా తమ శక్తిమేరకు జనాన్ని తరలించేం దుకు రెడీ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ టూర్!!

ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం 15, 16, 17 తేదీల్లో విశాఖలో పర్యటిస్తారు. ఈ పర్యటనను టూరిజం మంత్రి రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు ఇబ్బంది ఎదురయ్యే ప్రతిసారీ పవన్ కళ్యాణ్ ఇలా రంగంలోకి దిగి ప్రజల ఎటెన్షన్ డైవర్ట్ చేస్తుంటారని రోజా ఆరోపించారు.

ఇదిలా ఉండగా 15న కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించే పవన్ 16న ప్రజలను కలుస్తారు. వివిధ సమస్యలమీద ప్రజల నుంచి వినతులు శ్వీకరిస్తారు. ఒకేరోజు రెండు ప్రోగ్రాములు ఉండడంతో రేపు విశాఖ హోరెత్తనుంది. పోలీసులు సైతం విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు

Exit mobile version