Site icon vidhaatha

పార్టీ మారగానే ఐటీ,ఈడీ దాడులా?: వివేక్


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘నిజాయితీగా ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయలు టాక్స్ పే చేస్తున్నా. బీజేపీలో ఉండగా సీతారాముడు అన్నారు. పార్టీ మారగానే రావణుడితో పోల్చుతూ.. ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలోని పలు గ్రామాల్లో వివేక్ ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా వ్యాపార సంస్థలన్నీ చట్ట పరిధిలోని నడుస్తున్నాయని, వాటికి సంబంధించిన అన్ని ట్యాక్సులు చెల్లింపు చేస్తున్నానని పేర్కొన్నారు. బాల్క సుమన్ కు నేను ఇక్కడ గెలుస్తున్నానని కేసీఆర్ కు మొరపెట్టుకుంటే.. కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేయడంతో వారు ఐటీ, ఈడీలను నాపై పంపించారని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, అందుకే నేను పార్టీ మారాల్సి వచ్చిందన్నారు.


ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఒకటై నాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నన్ను అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టంలోని నిబంధన ప్రకారం నా స్నేహితుని సంస్థ కూడా చూస్తున్నానని, ఇటీవల కంపెనీ షేర్లు అమ్మితే రూ.50 కోట్లు లాభం వచ్చిందన్నారు.


9 కోట్లు టాక్స్ కూడా చెల్లించామని తెలిపారు. కేసీఆర్, బీజేపీ, అమిత్ షా కలసి తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా భావించి, హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి, బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

Exit mobile version