- పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా
- నిరంజన్‌రెడ్డి నియంతృత్వ పోకడలకు నిరసనగానే
విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రతినిధి: వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan Reddy)కి, బీఆర్‌ఎస్(BRS)కు గట్టి షాక్ తగిలింది. జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి (Lokanatha Reddy), వనపర్తి, పెద్ద మందడి ఎంపీపీలు కిచ్చారెడ్డి, మేఘారెడ్డి, ఆయా గ్రామాల పార్టీ నేతలు, మండలాల అధ్యక్షులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో తమ రాజీనామా పత్రాలను వారు చూపారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ విధానాలు, నిరంజన్‌రెడ్డి వ్యవహార శైలి నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లోకనాథ్‌రెడ్డి చెప్పారు. నియంత పాలన అంతకోసం పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్‌లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామాకు సిద్ధపడినట్లు తెలిపారు. గురువారం ఖిల్లా గణపురం మండలం సల్కేలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతోపాటు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, కిచ్చారెడ్డి (వనపర్తి) మాట్లాడారు.
మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని, అలాంటిది ప్రజలిచ్చిన అధికారంలో ఉండి కూడా ఆత్మ గౌరవాన్ని పొందలేకపోయామని లోకనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన తామంతా ప్రజల్లోకి వెళతామని, ఎందుకు అభివృద్ధి చేయలేకపోయామో వారికి వివరిస్తామని తెలిపారు. ప్రజలు సూచించిన ప్రత్యామ్నాయం ప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. మరో 20 రోజుల తర్వాత విలేకరుల సమక్షంలో కార్యాచరణ వెల్లడిస్తామని వివరించారు.
తాను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఎవరితోనూ ఏనాడు ఒక్క రూపాయి ఆశించకుండా రాజకీయం చేశానని మేఘారెడ్డి చెప్పారు. వనపర్తి ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో ప్రజల మనసుల్లో ఉందని త్వరలో ప్రజలు చెప్పే రోజులు వస్తాయని ఆయన అన్నారు. రాజీనామా చేసినవారిలో సల్కెలాపురం మార్కెట్ డైరెక్టర్ చరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.