Site icon vidhaatha

అమర్, జోగయ్య మధ్య లేఖల వార్ !!

విధాత‌: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి.. నాయకులు ఎవరికివారు బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తూ ప్రత్యర్థులను ఏదో రూపంలో టార్గెట్ చేస్తున్నారు. ఎవరి పెద్దరికం వారు చూపుకునేందుకు యత్నిస్తున్నారు. తాజాగా ఇద్దరు కాపునేతలు ఒకరిమీద ఒకరు లేఖలు రాసుకుంటూ ప్రశ్నలు సంధించుకుంటున్నారు.

వారిలో ఒకరు మంత్రి గుడివాడ అమర్ నాథ్ కదా మరొకరు సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య.. ఈ ఇద్దరూ కాపునేతలు కావడం గమనార్హం. జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామజోగయ్య మండిపడ్డ సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి జోగయ్య లేఖ రాశారు.

ఆ లేఖలో… “డియర్ అమర్నాథ్ రాజకీయాల్లో నువ్వో బచ్చావి.. పైకి రావలసినవాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుబోయి కాపుల భవిష్యత్తును పాడు చేయకు. అనవసరంగా పవన్ కల్యాణ్ పై బురద జల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్తు కోరి చెబుతున్నా” అంటూ హరిరామజోగయ్య.. గుడివాడ అమర్నాథ్ ను లేఖలో హెచ్చరించారు.

ఈ లేఖకు అమర్నాథ్ మరో లేఖలో వెసమాధానం ఇస్తూ .. “గౌరవనీయులైన హరిరామజోగయ్య గారికి నమస్కారాలు. కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జత కడుతున్న పవన్ కల్యాణ్ గార్కి రాయాల్సిన చెప్పాల్సిన విషయాలను పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

దాంతరువాత లెటర్ –2 పేరుతో గుడివాడ అమర్నాథ్.. మరో లేఖ రాశారు. సంధించారు. అందులో.. “వంగవీటి మోహన్ రంగా గారిని చంపించింది చంద్రబాబేనని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కల్యాణ్ ను మీరు సమర్థిస్తారా?.. స్పష్టం చేయగలరు” అని గుడివాడ అమర్నాథ్.. హరిరామజోగయ్యను కోరారు.

మరోవైపు కాపు సంఘాలు గుడివాడ అమర్నాథ్.. హరిరామజోగయ్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి కోసమే తరచూ పవన్ కల్యాణ్ పై గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి కాపునేతలు ఒకరిమీద ఒకరు అక్షరాయుధాలు విసురుకుంటున్నారు.

Exit mobile version