Warangal | ఎమ్మెల్యే రాజయ్యకు ఊరట.. సర్పంచ్‌ నవ్య కేసులో ఆధారాలు లేవు.. కేసు పెట్టలేం: పోలీసుల నివేదిక

Warangal సర్పంచ్ నవ్య‌ కేసులో మహిళా కమిషన్‌కు పోలీసుల నివేదిక ఊపిరి పీల్చుకున్న ఎమ్మెల్యే రాజయ్య ప్రస్తుతం సమసిపోయిన వివాదం గ్రామాభివృద్ధికి రూ.20 లక్షల కేటాయింపు ఇటీవలనే వెనక్కి తగ్గిన ఇరువురు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై అదే నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కురసపల్లి నవ్య చేసిన ఆరోపణలపై సరైన ఆధారాలు ఇవ్వని కారణంగా కేసు నమోదు చేయలేమంటూ మహిళా కమిషన్ కు పోలీసులు తేల్చి చెప్పారు. […]

  • Publish Date - July 5, 2023 / 12:01 PM IST

Warangal

  • సర్పంచ్ నవ్య‌ కేసులో మహిళా కమిషన్‌కు పోలీసుల నివేదిక
  • ఊపిరి పీల్చుకున్న ఎమ్మెల్యే రాజయ్య
  • ప్రస్తుతం సమసిపోయిన వివాదం
  • గ్రామాభివృద్ధికి రూ.20 లక్షల కేటాయింపు
  • ఇటీవలనే వెనక్కి తగ్గిన ఇరువురు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై అదే నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కురసపల్లి నవ్య చేసిన ఆరోపణలపై సరైన ఆధారాలు ఇవ్వని కారణంగా కేసు నమోదు చేయలేమంటూ మహిళా కమిషన్ కు పోలీసులు తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వివాదంలో మహిళా కమిషన్‌కు పోలీసులు తాజాగా సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ మధ్య లైంగిక ఆరోపణల వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై రాజీకి వచ్చి గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయించేందుకు ఎమ్మెల్యే సంసిద్ధత వ్యక్తం చేశారు. కొద్ది రోజుల తర్వాత రూ.20 లక్షల వ్యవహారం వివాదానికి దారితీసింది. రూ. 20 లక్షలు కేటాయిస్తాంగానీ, అప్పు పత్రం పై సంతకం పెట్టాలని ఎమ్మెల్యే అనుచరులు నిబంధన విధించడంతో నవ్య మరోసారి మీడియాకు ఎక్కారు.

తన దగ్గర ఉన్న ఆడియో, వీడియో రికార్డులు ఇవ్వాలని షరతు విధించినట్లు నవ్య‌ ఆరోపించింది. ఈ విషయమై పోలీసులను కూడా ఆశ్రయించింది. దీంతో ఇరువురు మధ్య నెలకొన్న సమస్య మరో పర్యాయం వివాదాస్పదమైంది. ఓ నాలుగైదు రోజులపాటు ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యం చేసుకొని నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. దీనిపై ధర్మసాగర్ పోలీసులు నవ్యను త‌న‌ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించాలని కోరారు. దీనికి ఆమె నిరాకరించడంతో ఇదే విషయాన్ని కమిషన్‌కు పోలీసులు నివేదిక రూపంలో సమర్పించారు.

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో గ్రామాభివృద్ధికి రూ.25 లక్షల నిధులు కేటాయిస్తూ ఎమ్మెల్యే ప్రొసీడింగ్ జారీ చేయడంతో ఇరువురి మధ్య రాజీ జరిగి సమస్య సద్దుమణిగింది.

ఈ కారణంగానే నవ్య ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించలేదని భావిస్తున్నారు. అదేవిధంగా మహిళా కమిషన్ దగ్గరికి నవ్య వెళ్ళకపోవడంతో నవ్య ఎమ్మెల్యే రాజయ్యల వివాదం ఎపిసోడ్ ప్రస్తుతానికి ముగిసింది.

ఈ వ్యవహారంలో సుమోటోగా జోక్యం చేసుకున్న మహిళా కమిషన్ పోలీసులను నివేదిక కోరింది. తాజా పోలీసుల నివేదికలో నవ్య ఆధారాలు సమర్పించలేదనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య ఊపిరి పీల్చుకున్నట్లు భావిస్తున్నారు.

Latest News