Warangal
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్టుకు బీజేపీ నిరసన
- వరంగల్లో సీఎం దిష్టిబొమ్మ దహనం
- రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా వరంగల్ చౌరస్తాలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిష్టిబొమ్మను బిజెపి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి, విడుదల చేశారు.
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ బాబు మాట్లాడుతూ హక్కు కోసం నిరసిస్తే, హామీపై నిలదీస్తే, అసమర్థతపై గొంతెత్తితే, అన్యాయంపై పోరాడితే అక్రమ అరెస్టులకు బిఆర్ ఎస్ తెరలేపిందని అన్నారు. రాబోవు ఎన్నికల్లో ఓటుతో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అప్పుడు ఏర్పడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లులను ఇప్పించి ప్రజాస్వామిక పాలనను బిజెపి కొనసాగిస్తుందని అన్నారు.
వరంగల్ తూర్పులో ఎస్.ఆర్ నగర్లో సుమారు 750ఇండ్లను కూల్చి 200వరకు నిర్మించి ప్రజల మధ్య చిచ్చు పెట్టారని అన్నారు. దేశాయ్ పేటలో జర్నలిస్టుల కోసం నిర్మించిన ఇండ్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆవాస్ యోజన స్కిం కింద నిర్మించినవే అని వాటిని పాత్రికేయులకు పంచకుండా ఇక్కడ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రానున్న ఎన్నికల కొరకు రాజకీయం చేస్తున్నాడని అన్నారు.
రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల నుండి రాష్ట్ర స్థాయి వరకు కెసిఆర్ పాలనను బొంద పెట్టడానికి యువత, మేధావులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, తూర్పు నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్, ఏరుకుల రఘునారెడ్డి, పిట్టల కిరణ్, బిజెపి నాయకులు జలగం రంజిత్, అధికార ప్రతినిధి మార్టిన్ లూథర్, గట్టికోప్పుల రాంబాబు, ప్రచార కార్యదర్శి బైరి శ్యాంసుందర్, సోషల్ మీడియా ఐటీ సెల్ కన్వీనర్ ఆడేపు వెంకటేష్,యువ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ అపురూప రజినిష్ నేత, మార్తా ఉషారాణి, కోమాకుల నాగరాజు డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.