- నీటి వినియోగంపై కమ్ముకున్న నీలి నీడలు
- నాణ్యతలేమితో కుంగిన మేడిగడ్డ
- అన్నారంలో వెలుగుచూసిన లీకేజీలు
- యాసంగి పంటలకు 10 టీఎంసీలు
- అవసరం అంటున్న రైతు నిపుణులు
- అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి నుంచి
- నీటిని వదలాలంటున్నరైతులు
- ఆరోపణలు, ప్రత్యారోపణల్లో అధికార, విపక్షాలు
- అవినీతి పరులను శిక్షించండి కానీ..
- ఈ ప్రాజెక్ట్‌లను నిరుపయోగం చేయకండి
- ఉన్న నీటిని వినియోగించాలన్న విజ్ఞప్తులు
విధాత: మేడిగడ్డ కుంగుబాటుతో బీఆరెస్‌కు ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. దీనితోపాటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నదన్న సందేహాలకు బలం చేకూరింది. వందేళ్లు మన్నికగా ఉండాల్సిన ప్రాజెక్ట్.. మూడేళ్లకే కుంగడం ఏమిటన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం సీపేజ్‌తో తమ పరువు ప్రతిష్ఠలు గోదారి పాలయ్యాయని బీఆరెస్ శ్రేణులు వాపోతుంటే.. మరోవైపు తమ పంటలు నీళ్లు లేక ఎండి పోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుంగిన బరాజ్‌ను రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకు రాకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని బీఆరెస్‌ను తిడుతున్నదికానీ.. తిరిగి గోదావరి నీటిని వినియోగంలోకి తీసుకు వచ్చే ప్రణాళిక కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆరెస్ చేసిన పాపానికి తాము బలి కావాల్సిందేనా? అని ఉత్తర తెలంగాణ రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లోపు మరమ్మతులు అయ్యేనా?
లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ప్రధానమైన మేడిగడ్డ బారాజ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిన విషయం అందరికీ తెలిసిందే. వెంటనే ఈ బరాజ్‌లో ఉన్న నీటిని మొత్తం భద్రత రీత్యా ఖాళీ చేయించారు. ఎంత మేరకు డ్యామేజీ అయిందని లెక్కలు తీశారు. జరిగిన తప్పులు, పొరపాట్లపై విజిలెన్స్ కమిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కాగ్ నివేదికలు ఇచ్చాయి. ఇందులో భారీ అక్రమాలు జరిగాయని ఈ నివేదికలు స్పష్టం చేశాయి. అసెంబ్లీలో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అధికార పక్షం ఎత్తి చూపింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ లక్ష కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి వినియోగంలోకి తెస్తారా? లేదా? అన్న చర్చ ఉత్తర తెలంగాణ రైతాంగంలో జరుగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, మల్కాజిగిరి, భువనగిరి, నల్లగొండ పార్లమెంటులో సూర్యాపేట నియోజకవర్గం వరకు నీళ్లు వస్తాయి. ఇన్ని పార్లమెంటరీ నియోజక వర్గాలపై ప్రభావం చూపే ఈ ప్రాజెక్ట్ నీటిని వినియోగంలోకి తీసుకురాకపోతే రాజకీయంగా ఎవరికి నష్టం అనే చర్చ కూడా నడుస్తున్నది. ప్రాజెక్టు దుస్థితికి కారణమైన బీఆరెస్‌ను లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రజలు ఓడిస్తారా? అవసరమైన సమయంలో నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తారా? అనే చర్చ కూడా నడుస్తున్నది. ఈ ప్రాజెక్ట్ నీటిని వియోగించక పోయనా, ఈ యాసంగికి కావాల్సిన నీటిని అందించకపోయినా దీని ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పాలక పార్టీపైనా పడే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పార్లమెంటు ఎన్నికల ముగింట యాసంగి పంట
గోదావరి పరివాహక ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చే నీటి లిఫ్టింగ్‌పై ఆధార పడిన రైతులు యాసంగిలో కూడా వరి తదితర పంటలు వేశారు. ఈ పంటలన్నీ ఇప్పడు పొట్టమీద ఉన్నాయి. కొన్ని చోట్ల పంటలు ఈనుతున్నాయి. ఈ సమయంలో పంటలకు అధికంగా నీరు అవసరం ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాకాలంలో కూడా సరిగ్గా వర్షాలు కురువక పోవడంతో భూ గర్భ జలాలు తగ్గాయి. చాలాచోట్ల బోర్లల్లో నీరు అడుగంటి పోయింది. ఈ సమయంలో ఎల్లంపల్లి నుంచి వచ్చే నీరు అవసరం అవుతుంది. యాసంగి పంటను రైతులు బతికించుకొని, పంటను పండించుకోవడానికి 10 టీఎంసీల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెపుతున్నారు. ఈ నీరు చెరువులు, కాళేశ్వరం లింక్‌లో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లకు పంపిస్తే భూగర్భ జలాలు పెరిగి బోర్ల ద్వారా పంటలు పండించుకోవడానికి అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.
30 టీఎంసీలు వినియోగానికి సిద్ధం
బరాజ్ కుంగుబాటు నేపథ్యంలో మేడిగడ్డను పూర్తిగా ఖాళీ చేసినా.. అన్నారం, సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో కనీసం 30 టీఎంసీల నీరు ఉందని, ఇందులో నుంచి 10 టీఎంసీలు యాసంగి పంట కోసం ఎత్తి పోసినా రైతుల పంటలు పండుతాయని చెపుతున్నారు. రైతుల ఈ పరిస్థితిని గుర్తించి సర్కారు పెద్దలు యాసంగి పంటలు చేతికి రావడానికి నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. మరో వైపు కేసీఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం డబ్బులన్నీ ప్రజలవేనని, దీనికి తీసుకు వచ్చిన అప్పును కూడా ప్రజలు చెల్లించాల్సిందేనని రైతులు అంటున్నారు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను, అందుకు కారకులైన వారిని శిక్షించండి.. అవినీతి సొమ్మును కక్కించండి కానీ ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసి, రైతాంగానికి ఇబ్బంది పెట్ట వద్దని అంటున్నారు. దీనిని వినియోగించక పోయినా తెచ్చిన అప్పులకు చెల్లింపులు చేయాల్సిందేనని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను వినియోగించుకోవడమే సరైన పద్ధతని అంటున్నారు. ఇందు కోసం మేడిగడ్డ పునరుద్దరణ పనులు ఈ వేసవిలో చేపట్టి త్వరగా వినియోగంలోకి తీసుకు రావాలని ఉత్తర తెలంగాణ రైతులు ప్రభుత్వాన్నికోరుతున్నారు.