Site icon vidhaatha

కాంగ్రెస్‌- బీఆరెస్ వాట‌ర్ వార్‌


విధాత‌: కాంగ్రెస్‌, బీఆరెస్ పార్టీల మ‌ధ్య వాట‌ర్ వార్ న‌డుస్తోంది. పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఈ రెండు పార్టీలు నీటిపైనే కేంద్రీక‌రించాయి. బీఆరెస్ పార్టీ చలో కాళేశ్వ‌రం అంటూ మేడిగ‌డ్డ‌కు వెళితే.. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నేత‌ సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి జిల్లా నేత‌ల‌తో క‌లిసి పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.


కాగా బీఆరెస్ నేత‌ల ప‌ర్య‌ట‌న నేపథ్యంలో నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి స‌చివాల‌యంలో కాళేశ్వ‌రంపై మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఆ త‌రువాత మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి సంయుక్తంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించి బీఆరెస్‌పై నిప్పులు చెరిగారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మరో రెండు వారాల్లో షెడ్యూల్ విడుద‌ల కానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు నీటి చుట్టూ తిరుగుతున్నాయి. రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం వాట‌ర్ వార్ నడుస్తున్నది.


కాళేశ్వ‌రం చుట్టూ..


అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ అంతా కాళేశ్వ‌రం చుట్టే తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు మేడిగ‌డ్డ బరాజ్ కుంగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. బరాజ్ కుంగిన తీరుగానే బీఆరెస్ కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ల‌క్ష కోట్ల‌తో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరింది. ప్ర‌జ‌లు న‌మ్మారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌ట్టారు. ఆ త‌రువాత డిసెంబ‌ర్ 7వ తేదీన అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వ‌రంలో అవినీతిని బ‌య‌ట పెట్టాల‌ని నిర్ణ‌యించింది.


కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌పై జుడిషియ‌రీ విచార‌ణ‌కు ఆదేశించింది. అలాగే విజిలెన్స్ విచార‌ణ చేయిస్తోంది. ఇప్ప‌టికే విజిలెన్స్.. ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ఇప్ప‌టికే కాళేశ్వ‌రం సీఈని ట‌ర్మినేట్ చేశామ‌ని, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను సైతం త‌ప్పించామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇదే స‌మ‌యంలో బరాజ్‌ల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరామ‌ని, ఈ మేర‌కు చంద్ర‌శేఖ‌ర్ అయ్య‌ర్ చైర్మ‌న్‌గా క‌మిటీ నియామ‌కం కూడా జరిగింద‌ని మంత్రి తెలిపారు.


అవినీతిపై వేగంగా..


కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టులో అక్ర‌మాల‌పై వేగంగా స్పందించింది. మొద‌ట‌గా మంత్రులు మేడిగ‌డ్డ‌కు వెళ్లి ప‌రిశీలించారు. అక్క‌డే సాగునీటి పారుద‌ల శాఖ ఈఎన్సీతో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇప్పించారు. ఆ త‌రువాత ప్ర‌భుత్వం అసెంబ్లీలో శ్వేత ప‌త్రం విడుద‌ల చేసింది. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్ట్‌ల‌పై చ‌ర్చ‌ సంద‌ర్భంగా ఎమ్మెల్యేలంద‌రినీ మేడిగ‌డ్డ‌కు తీసుకు వెళ్లింది. కానీ ఆనాడు బీఆరెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో క‌లిసి వెళ్ల‌డానికి నిరాక‌రించారు. అదే రోజు న‌ల్ల‌గొండ‌లో బీఆరెస్ స‌భ నిర్వ‌హించింది. తాజాగా మేడిగడ్డకు ఏమీ కాలేద‌ని, మూడు పిల్ల‌ర్లు కుంగితే కాంగ్రెస్‌ పార్టీ నేత‌లు భూత‌ద్దంలో చూపిస్తున్నార‌ని మాజీ మంత్రి కేటీఆర్ అన‌డం గ‌మ‌నార్హం.


కాగ్‌ రిపోర్టను తప్పుపడుతున్న బీఆరెస్‌


కాళేశ్వ‌రం నిర్మాణంలో ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయ‌ని కాగ్ నివేదించింది. బీఆరెస్ హ‌యాంలో కాళేశ్వ‌రంలో భారీ అవినీతి జ‌రిగిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేసింది. అయితే.. బీఆరెస్ మాత్రం కాగ్ రిపోర్ట్‌ను త‌ప్పు ప‌ట్టింది. కాగ్ రిపోర్ట్ ఆధారంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీంతో పాటు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే బీఆరెస్ నాయకులు మాత్రం తాము ఎలాంటి అక్ర‌మాల‌కు, అవినీతికి పాల్ప‌డలేద‌ని ఒక ప‌క్క‌ అంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం తమపై క‌క్ష ఉంటే అరెస్ట్ చేసుకోండి కానీ.. రైతుల‌కు నీళ్లు ఇవ్వాల‌ని అంటున్నారు.


మ‌రోవైపు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌ల్కాజిగిరి పార్ల‌మెంటులో పోటీ చేయ‌డానికి రావాల‌ని స‌వాల్ విసిరారు. తాను సిరిసిల్ల‌ సీటుకు రాజీనామా చేసి వ‌చ్చి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీనికి మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పందిస్తూ ‘సీఎం రాజీనామా చేయాల్సిన ప‌నిలేదు. నేను రాజీనామా చేసి సిరిసిల్ల‌కు వ‌స్తా. నువ్వు రాజీనామా చేయి అక్క‌డ పోటీ చేసి గెలువు..’ అంటూ కేటీఆర్‌కు ప్ర‌తి స‌వాల్ విసిరారు. ఇలా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముంగిట‌ ఈ రెండు పార్టీల మ‌ధ్య వాట‌ర్ వార్ జ‌రుగుతోంది.

Exit mobile version