Site icon vidhaatha

Uttam Kumar Reddy | ఉమ్మడి నల్లగొండలో 12సీట్లు గెలుస్తాం.. పీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఎన్‌.ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy |

70సీట్లతో అధికారంలోకి వస్తాం

విధాత: ఉమ్మడి నల్లగొండలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని, రాష్ట్రంలో 70సీట్లతో అధికారంలోకి వస్తామని పీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన తన సతీమణి పద్మావతి ఉత్తమ్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలతో రాష్ట్ర వనరులను దోచుకుంటే..ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో దోపిడికి పాల్పడుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ దళిత బంధు వంటి సంక్షేమ పథకాలలో అవినీతికి పాల్పడిన, సాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్ అక్రమ వ్యాపారాలతో దోపిడికి పాల్పడిన సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం విచారకరమన్నారు.

కోదాడ, హుజూర్ నగర్ బీఆరెస్ ఎమ్మెల్యేలపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో తాను హుజూర్‌నగర్‌, పద్మావతి కోదాడలో పోటీ చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్‌లు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని, మళ్లీ ఎన్నికల ముందు సంక్షేమ పథకాలతో హడావుడి మొదలు పెట్టారని ఈ దఫా ఆయన మోసాలను ప్రజలు తిప్పికొట్టి కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకుముందు మఠంపల్లి, హుజూర్‌నగర్ మండలాల్లో పర్యటించిన ఉత్తమ్ ఏఎన్‌ఎం వర్కర్ల సమస్యలపై వినతి పత్రం స్వీకరించారు.

Exit mobile version