Site icon vidhaatha

హైద‌రాబాద్‌ను యూటీగా కొన‌సాగించాలి.. వైసీపీ కొత్త నాట‌కం



అమ‌రావ‌తి, ఫిబ్రవరి 14: వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు వైసీపీ పావులు క‌దుపుతోందా? కేసీఆర్‌-జ‌గ‌న్ ఆడుతున్న ఉమ్మ‌డి రాజ‌ధాని డ్రామా ఏ పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుంది? ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక రాజ‌కీయ కుట్ర ఉందా?


ఏపీలో మూడురాజ‌ధానుల పేరుతో ఐదేళ్లు కాల‌యాప‌న చేసిన వైసీపీ, తాజాగా మ‌రికొన్నేళ్లు హైద‌రాబాద్‌ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా కొన‌సాగించాల‌న్న డిమాండ్ తెర‌పైకి తెచ్చింది. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో ఈ డిమాండ్‌ను స్వ‌యంగా వెల్ల‌డించ‌డ‌మేకాదు, పార్ల‌మెంటు ఎన్నిక‌లు అయ్యాక కేంద్రంపై ఒత్తిడి తెస్తామ‌ని కూడా చెప్పారు. ఈ విష‌యం కాస్త ర‌చ్చ‌కు దారితీసింది. దీనిపై తెలంగాణ నేత‌లు ఘాటుగానే స్పందించారు.


దీంతో ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం మాట మార్చారు. ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు.


హైదరాబాద్ విశ్వనగరం అని.. అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్థానమా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని… లేని మాటలకు, తామేం మాట్లాడబోమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మాత్రం దీనివెనుక కేసీఆర్ కుట్ర ఉంద‌నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.


పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మ‌రోమారు సీమాంధ్ర ఓటర్ల మ‌ద్ద‌తు కోసం వైసీపీ ద్వారా కేసీఆర్ ఆడిస్తున్న కుట్ర‌లో భాగ‌మే అని భావిస్తున్నారు. హైద‌రాబాద్‌ను మ‌రికొంత‌కాలం యూటీగా ఉంచ‌డానికి సీఎం రేవంత్‌రెడ్డి అంగీక‌రించ‌ర‌ని, అప్పుడు దాన్నే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అస్త్రంగా వాడి సీమాంధ్ర ఓట్ల‌కు గాలం వేయాల‌న్న ప్లాన్ దీనివెనుక ఉంద‌నే అనుమానాలు కాంగ్రెస్ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version