Site icon vidhaatha

Soma Bharat | ఎవ‌రీ సోమా భ‌ర‌త్‌..? క‌విత ఈడీ ఎపిసోడ్‌లో ఆయ‌న పాత్రేంటి..?

Soma Bharat | ఢిల్లీ లిక్క‌ర్ స్కాం( Delhi Liquor Scam )లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత( BRS MLC Kavitha ) నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్( ED ) విచార‌ణ‌కు గైర్హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మార్చి 11న ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన క‌విత‌ను ఆ రోజు రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు విచారించారు. మ‌ళ్లీ మార్చి 16న ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌రోసారి హాజ‌రు కావాల‌ని 11వ తేదీనే క‌విత‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. అయితే క‌విత 16న ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌ని అంద‌రూ భావించారు. ఆమె ఒకరోజు ముందే ఢిల్లీకి వెళ్లారు కూడా. 15వ తేదీన మహిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు క‌విత‌.

ఇక హ‌స్తిన త‌న తండ్రి కేసీఆర్ నివాసంలో ఉన్న క‌విత‌.. 16న ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌ని భావించారు. ఈడీ చెప్పిన స‌మ‌యం 11 గంట‌లు దాటిపోయిన‌ప్ప‌టికీ ఆమె విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. క‌విత త‌ర‌పున సోమా భ‌ర‌త్ కుమార్( Soam Bharat Kumar ) అనే సీనియ‌ర్ అడ్వ‌కేట్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. క‌విత రాసిన లేఖ‌ను తీసుకెళ్లి ఈడీకి అందించారు సోమా భ‌ర‌త్. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సోమా భ‌ర‌త్ ఎవ‌రు..? అనే అంశంపై అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో, ఇటు మీడియాలో చ‌ర్చానీయాంశ‌మైంది.

కేసీఆర్ కుటుంబానికి న‌మ్మిన‌బంటు

సోమా భ‌ర‌త్ స్వ‌స్థ‌లం సూర్యాపేట జిల్లా( Suryapeta ) తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ర్ధ‌మానుకోట గ్రామం. ఆయ‌న వృత్తి రీత్యా అడ్వ‌కేట్. తెలంగాణ ఉద్య‌మం( Telangana Movement )లో కీల‌క‌పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలో కేసీఆర్( KCR ) కుటుంబానికి న‌మ్మిన‌బంటులా మారారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత గులాబీ పార్టీకి న్యాయ‌ప‌రంగా ఎదురైన చిక్కుల‌ను ప‌రిష్క‌రించ‌డంలో పేరు మోసిన ఈ సీనియ‌ర్ అడ్వ‌కేట్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీ వ్య‌వ‌హారాల్లో కూడా చురుకుగా వ్య‌వ‌హరించ‌డంతో.. కేసీఆర్ ఆయ‌న‌ను బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. 2022లో సోమా భ‌ర‌త్‌కు తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ చైర్మ‌న్‌గా అవ‌కాశం వ‌రించింది. భ‌ర‌త్‌ను కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌( Pragathi Bhavan )కు పిలిచి నియామ‌క ప‌త్రాన్ని అంద‌జేశారు.

క‌విత దాదాపుగా భ‌ర‌త్‌నే న‌మ్ముకున్న‌ట్లు ప్ర‌చారం

పార్టీ లీగ‌ల్ వ్య‌వ‌హారాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న సోమా భ‌ర‌త్‌.. క‌విత ఈడీ నోటీసులు జారీ అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌తి అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి, ఆమెకు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తున్నారు. న్యాయ‌ప‌రంగా ఎదుర‌య్యే చిక్కుల‌ను ఎదుర్కొనేందుకు క‌విత దాదాపుగా భ‌ర‌త్‌నే న‌మ్ముకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మార్చి 11వ తేదీన క‌విత ఈడీ విచార‌ణ‌కు వెళ్లిన‌ప్పుడు సోమా భ‌ర‌త్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ లీగ‌ల్ సెల్( BRS Legal Cell ) ఢిల్లీకి చేరుకుని కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఢిల్లీలో లీగల్‌గా తనకున్న సర్కిల్‌ను ఉపయోగించుకుని సోమా భరత్ కూడా దాదాపుగా కవితను ఈడీ విచారణ నుంచి కాపాడుకొచ్చే ప్రయత్నం చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కీల‌క‌మైన లీగ‌ల్ అంశాల‌ను తెర‌పైకి తీసుకొచ్చిన సోమా భ‌ర‌త్

క‌విత‌పై కేంద్రం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, వేధిస్తుంద‌ని సోమా భ‌ర‌త్ మీడియాకు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క‌మైన లీగ‌ల్ అంశాల‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. సీఆర్పీసీ, మ‌నీలాండ‌రింగ్ యాక్ట్ 50 ప్ర‌కారం మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని చెప్పారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందని గుర్తుచేశారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందని, ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని సోమా భ‌ర‌త్ పేర్కొన్నారు.

Exit mobile version