Site icon vidhaatha

BJP వ్యూహం ఫలించేనా?

BJP

బీజేపీ మొదటి నుంచి మూడు అంశాల ఆధారంగా బలపడాలని చూసింది. మొదటిది రామ మందిర నిర్మాణం, రెండోది ఆర్టికల్‌ 370 రద్దు, మూడోది ఉమ్మడి పౌర స్మృతి. మొదటి రెండు అంశాలను విజయవంతంగా అమలు చేసింది. ఈ మూడింటి పేరుతో ఓట్లను రాబట్టి, రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా.. వాటి నుంచి ఆశించిన ఫలితాలను ఇంకా బీజేపీ రాబ్టట్టుకోలేదనే అభిప్రాయం ఉన్నది. అందుకు కారణాలూ ఉన్నాయి. రామ జన్మభూమి వివాదంలో గతంలో జరిగిన సంఘటనలు హిందూ, ముస్లింల మధ్య భావోద్వేగాలకు కారణమయ్యాయి. నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవు.

రెండోది 370 అధికరణాన్ని పార్లమెంటు ద్వారా 2019 ఆగస్టు 5న రద్దు చేస్తూ జమ్ముకశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని తొలగించింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌గా విభజించింది. ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. నాటి నుంచి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో? అక్కడి ప్రజల అభిప్రాయం ఏమిటో? బయటి ప్రపంచానికి తెలియడం లేదు. కేంద్రం మాత్రం అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావరణ ఉన్నదని అంటున్నది. మరి అక్కడ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదనే విపక్షాల ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు.

సనాతన ధర్మంపై..

తాజాగా సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కొందరు హిందూత్వ వాదులు విరుచుకుపడుతున్నారు. ఆయన తలకు వెల కట్టారు. దీనికి ఉదయనిధి స్టాలిన్‌ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నారు. బీజేపీ నేతల బెదిరింపులపై సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఇండియా పేరును భారత్‌ మార్చాలనే కేంద్రం ప్రయత్నాలపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురవు తుండగా.. రాజ్యాంగ నిపుణులు కూడా మార్చడం అంత సులభం ఏమీ కాదని చెబుతున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇండియా, దటీజ్‌ భారత్‌ అని ఉన్నదని, భారత్‌ అనే పదం వివరణగానే ఉన్నదని రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచారి స్పష్టం చేశారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా స్థానంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌ అని వాడాలనుకుంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే మూడింట రెండొంతుల మెజారిటీతో ఉభయ సభలు ఆమోదించాలి. సంఖ్యాపరంగా లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో ఆ బిల్లు పాస్‌ కావడం కష్టం.

బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి రోజురోజుకూ బలపడుతుండటం, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని నిర్ణయించడం ముఖ్య పరిణామంగా ఉన్నది. ఐక్యత దిశగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి కూటమి నేతలు స్పష్టమైన అవగాహనతో వెళుతున్నారు. అలాగే కేంద్రం ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి గురించి కూడా ఇండియా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

మణిపూర్‌ చెలరేగుతున్న హింస, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో మత ఘర్షణలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు, అదానీ అంశం, రైతు సమస్యలు, కులాల వారీగా జన గణన వంటి అంశాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలని పట్టుబడుతున్నాయి. దీంతో బీజేపీ వ్యూహాలకు విపక్షాలు ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతున్నాయి. దీంతో ఏం చేయాలో ఆ పార్టీ పెద్దలకు అర్థం కావడం లేదు. అందుకే ప్రధాని నేతృత్వంలో జరిగిన కేంద్రమంత్రి వర్గంలో భారత్‌, సనాతన ధర్మంపై ఆచితూచి స్పందించాలని సూచించారని విశ్లేషకులు అంటున్నారు.

ముఖ్యంగా భారత్‌ అంశంపై అతిగా స్పందించవద్దని మోదీ మంత్రులకు హితవు పలికారు. ‘చరిత్ర లోతుల్లోకి తొంగి చూడకండి. కానీ రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టబడి ఉండండి. సమకాలిన పరిస్థితుల గురించి మాట్లాడండి. వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థవంతమైన స్పందన ఉండాలి’ అన్నారు. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ యేతర రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఆ పార్టీ నేతలు ఒక మతంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల అరబ్‌ దేశాలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెల్తింది. కేంద్రం తీసుకున్నవ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన, మణిపూర్‌లో జరుగుతున్న హింసపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు స్పందించాయి.

దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే జీ 20 సమావేశాల సందర్భంగా వివిధ దేశాల నేతల ముందు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే మోదీ ‘భారత్‌’, సనాతన ధర్మం వంటి అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం రచిస్తున్న వ్యూహాలు ఆ పార్టీని మూడోసారి గట్టెక్కిస్తాయా? లేక విఫలమవుతాయా? అన్నది వేచి చూడాలి.

Exit mobile version